ఏపీ పెట్టుబడుల హడావిడి వెనుక రాజకీయమేమిటీ?
x
Lokesh in Australia Tour

ఏపీ పెట్టుబడుల హడావిడి వెనుక రాజకీయమేమిటీ?

చంద్రబాబు సింగపూర్ నుంచి లోకేష్ ఆస్ట్రేలియావరకు.. పెట్టుబడుల పర్యటనల పరమార్థం ఏమిటీ?


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హడావిడి నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ మొదలు కేంద్రంలోని టీడీపీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు వరకు “లక్షల కోట్ల పెట్టుబడులు”, “20 లక్షల ఉద్యోగాలు” అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. గూగుల్‌తో కుదిరిన డేటా సెంటర్ ఒప్పందం ఈ హైప్‌కు మరింత ఊతమిచ్చింది. ఈ సమధికోత్సాహం వెనుక అసలు వాస్తవం ఎంత? ప్రచారం ఎంత అనేది అధికార యంత్రాంగానికి తప్ప మూడో కంటికి తెలియడం లేదు.

అసలు ఈ హడావిడి ఎందుకు సాగుతోందీ? అనే దానిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల పూర్తి చేస్తామన్న అమరావతి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా? అని కొందరంటుంటే గ్లోబల్ ఇమేజ్ క్రియేషన్ లో భాగమని కొందరంటున్నారు. దీనిపై అధికారుల మాటేమిటో, విమర్శకుల ఆలోచన ఏమిటో చూద్దాం.
విశాఖ సదస్సే సర్వస్వమా!
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో CII Partnership Summit 2025 నిర్వహించబోతోంది. “Technology, Trust, Trade” అనే థీమ్‌తో జరుగుతున్న సమ్మిట్ ఇది. దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నది దీని ఉద్దేశ్యం. దీని కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (UAE, లండన్ పర్యటనలు), మంత్రి నారాయణ (మలేషియా-సింగపూర్ విజిట్లు), లోకేష్ (ఆస్ట్రేలియా), కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (అమెరికా) పర్యటనలు కొనసాగుతున్నాయి.
ఈ పర్యటనలన్నీ రాబోయే సమ్మిట్‌కు పెట్టుబడిదారులను ఆహ్వానించే రోడ్‌షోలుగా జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గూగుల్‌ డేటా సెంటర్‌ — భారీ ఒప్పందమా, ప్రచార ప్రాజెక్టా?
-ఈ నేపథ్యంలో అత్యధికంగా ప్రచారం పొందిన ప్రధాన ఒప్పందం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్. గూగుల్ సంస్థ విశాఖపట్నం సమీపంలోని తర్లువాడ-రాంబిల్లి ప్రాంతాల్లో AI డేటా సెంటర్ నిర్మించేందుకు రూ. 1,23, 000 కోట్ల వరకు పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. ఇది ఐదేళ్లలో వచ్చే ప్రాజెక్టు. ఈ ప్రాజక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24 వేల కోట్ల రూపాయల రాయితీలను గూగుల్ కి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా అంత ఉండకపోవచ్చునని విమర్శకులు చెబుతున్నారు.
ఇతర MoUలు ఎన్ని కుదిరాయంటే.
-ఇక రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఇతర ఒప్పందాలలో ANSR – Vizag GCC Innovation Campus (మధురవాడ IT క్లస్టర్) ఉంది. ఈ ఏడాది జూలై 9న MoU కుదిరింది. ఇది కూడా 5 ఏళ్ల ప్రాజెక్టు. ₹1,000 కోట్ల పెట్టుబడితో పెట్టే ప్రాజెక్ట్ ఇది. 10,000 ఉద్యోగాలు లక్ష్యం.
-Sattva Group విశాఖపట్నంలో ‘Vantage Vizag’ మిక్స్‌డ్-యూజ్/IT క్యాంపస్ నెలకొల్పేలా ప్రకటించింది. ₹1,500 కోట్ల పెట్టుబడితో 25 వేల వరకు ఉద్యోగాలు వస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.
-APSSDC భాగస్వామ్యంలో స్కిల్ ల్యాబ్స్ రానుంది. దీనికి సంబంధించి MoU కుదిరింది. ఇది చాలా స్వల్పపెట్టుబడి. కేవలం 15 కోట్లు. మంగళగిరిలో వస్తుంది. వచ్చే 3 ఏళ్లలో 20 అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్ వస్తాయి. ఇది ఇండస్ట్రీ-స్కిల్స్ ప్రాజెక్ట్. 9,000 వేల మంది యువతకు ఇండస్ట్రీ- రిలవెంట్ ట్రైనింగ్ ఇస్తారు.
దక్షిణ కోరియాకి చెందిన -Kunhwa Engineering- అమరావతి ఇన్‌ఫ్రా పట్ల ఆసక్తి చూపింది.ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందిది.

ఇవిగాక, లులూ మాల్, రహేజా వంటి నిర్మాణ సంస్థలు కూడా వస్తున్నాయి. నవంబర్ 14, 15 తేదీలలో మరికొన్ని సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా MoU లెక్కను ప్రకటించలేదు. సమ్మిట్ తర్వాతే తుది లెక్క వస్తుంది.
అమరావతి నత్తనడకనేనా?
మరోపక్క, రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. తాజాగా CRDA కొత్త కార్యాలయం ప్రారంభించారు. “మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది ” అని చంద్రబాబు ప్రకటంచినా అనుకున్నంత వేగంగా పనులు సాగడం లేదు. టెండర్ వివాదాలు, ల్యాండ్-పూలింగ్ సమస్యలు, పాత కాంట్రాక్టర్ ఇష్యూలు మొదలైన అడ్డంకులు ఇప్పటికీ అమరావతిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహణ ఊపందుకుందన్న విమర్శలు వస్తున్నాయి.
వాగ్దానాలు ఎక్కువ, పారదర్శకత తక్కువ..
“20 లక్షల ఉద్యోగాలు”, “లక్షల కోట్ల పెట్టుబడులు” అనే ప్రకటనలు సాక్ష్యాధారాలు లేకుండా ఉన్నాయి అని ఆక్షేపించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. భారీ ఇన్సెంటివ్‌లు, పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు భూములు అప్పగింత, పవర్ టారిఫ్ సబ్సిడీలు వంటివి- రాష్ట్ర ఆర్ధిక స్థిరత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
"ప్రస్తుతం పెట్టుబడుల వాతావరణం ప్రకటనల దశలోనే ఉంది. నిజమైన ఫలితాల కోసం కొంత సమయం పడుతుంది. అదే సమయంలో పారదర్శకత కీలకమేనని" ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ అన్నారు.
గ్లోబల్ ఇమేజ్‌ కోసం అవసరమైన ప్రయత్నమే...
అయితే ప్రభుత్వ వాదన భిన్నంగా ఉంది. “ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. అభివృద్ధికి అవసరమైన గ్లోబల్ కేపిటల్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్లు, AI ఎకోసిస్టం, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ వంటివి రావడమే భవిష్యత్ దిశానిర్దేశకాలు” అని రాష్ట్ర మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గూగుల్ లాంటివి “సిగ్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్” మాత్రమే కాక, దీనివల్ల ఇతర ప్రాజెక్టులు రాబోతున్నాయన్న వాదన ప్రభుత్వం వైపు నుంచి వస్తోంది.
ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా CII Partnership Summit 2025- నవంబర్ 14, 15 తేదీల్లో జరుగుతుంది. అధికారులు దీనిని “వాస్తవ పెట్టుబడుల వర్షానికి సెట్టింగ్” గా అభివర్ణిస్తున్నారు.
ఇందులో ఎన్ని MoUs కుదురుతాయి, అందులో ఎన్ని ఆచరణలోకి వస్తాయి, ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్-బ్రేకింగ్ వరకు వస్తాయన్నది కీలక పరిమాణం. అందుకే ఈ కసరత్తు తప్ప ప్రజల్ని మభ్యపెట్టాలన్నది కాదని ప్రభుత్వం గట్టిగా చెబుతున్నా గత అనుభవాల దృష్ట్యా ఇదంతా కంటితుడుపు చర్యేనని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి విమర్శకులు చెబుతున్నారు.
ప్రచారానికే వందల కోట్ల ఖర్చా...
పెట్టుబడులను ఆకర్షించే పేరిట వందల కోట్లు ఖర్చు పెట్టడాన్ని మానవ హక్కుల వేదిక తప్పుబట్టింది. ఇప్పటికి చాలాసార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి ఏమి సాధించారో చెప్పాలని నిలదీసింది. చెప్పింది ఎక్కువ వచ్చింది తక్కువని అభిప్రాయపడింది.
“ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణం మళ్లీ ఊపందుకుంటున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎక్కువ ఒప్పందాలు ప్రకటనల దశలోనే ఉన్నాయి.
గూగుల్ ప్రాజెక్ట్‌ వంటివి వాస్తవ రూపం దాల్చితేనే రాష్ట్ర ఆర్థిక సత్తా ఏమిటో తెలుతుంది. ప్రచారం కాదు, అమలు మాత్రమే నిజమైన మైలురాయి. అది తేలాలంటే మరో 3 నెలలు ఆగాల్సిందే” అన్నారు మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు మార్పు శరత్.
Read More
Next Story