వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇకపై మార్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తల భారీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీలో మార్పులు చేర్పులు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా సుమారు 65 మందిని మార్చారు. ఇందులో కొందరు కొత్త వారు కాగా కొందరు ఒక నియోకవర్గం నుంచి మరో నియోకవర్గానికి మారిన వారు ఉన్నారు. ఇకపై మార్పులు ఉండవు. 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్నవారే అభ్యర్థులు. ఇక గెలుపు మీ చేతుల్లో ఉంది. నేను రోజూ నియోజకరవర్గ స్థాయిలోనూ సమీక్షిస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, నియోకవర్గ సమన్వయకర్తలు, మండల, జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశం పూర్తిస్థాయిలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు సంబంధించినది. సుమారు 2500 మంది బూత్ స్థాయిలో ఎలా మసలుకోవాలో ఈ సభలో నిర్థేశించారు. వచ్చిన వారందరికీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు. ఇకపై నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇప్పుడు ఉన్నవారే అభ్యర్థులు, పాత వారు అలాగే ఉంటారు. ఇక గెలుపు మీచేతుల్లో ఉందని సీఎం చెప్పడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంకా నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు కొనసాగే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడంతో అంతా ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా వారి నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పులు లేకుండా ఉన్న వారు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మార్పులకు గురైన ఎమ్మెల్యేల మనసుల్లో మాత్రం కాస్తంత భయం ఉందనే చెప్పాలి. మార్పు జరిగిందంటే గెలుపు సులువు కాదనేది అర్థమైందని కొందరు పేరు చెప్పటానికి ఇష్టపడని వారు వ్యాఖ్యానించారు. అంతర్గత సమావేశం కావడంతో బయట వారికికెవ్వరికీ అనుమతి లేదు.
ముందుగా మూడు ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని పార్టీ భావించింది. ఆ మేరకు ఆలోచనలు కూడా చేశారు. అయితే ఎన్నికల సమయం తక్కువ ఉండటం వల్ల ఒకేసారి సమావేశం ఏర్పాటు చేసి చెప్పాల్సినవి చెప్పి ముగిస్తే బాగుంటుందని భావించిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Next Story