CM Jagan With MLA Alla Ramakrishnareddy (File Photo)

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇమేజ్‌ కుప్పకూలిందా? ఇపుడాయన కూడా ఆయారాం గయారాం జాబితాలో చేరిపోయాడా?


టాక్‌ మారింది. కాదు మనిషే మారాడు. ఇటీవల జగన్‌ను వదిలి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే సీఎం జగన్‌ పంచకు చేరాడు. మొదట పార్టీని వీడిన తరువాత వైఎస్‌ షర్మిల వద్దకు చేరి ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నియోకవర్గ రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆళ్ల వార్తల్లో వ్యక్తి అయ్యారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏది చేసినా నలుగురికోసం చేస్తాడనే విశ్వాసం ఇప్పుడు ప్రజలకు లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అన్నా తమ్ముళ్లు వైఎస్‌ జగను అంటిపెట్టుకుని ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి కావాల్సిన కాంట్రాక్ట్‌లు తీసుకుంటున్నారని, ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆయనకు అప్పగించినట్లు పార్టీలోని కొందరు చెబుతున్నారు. అదే విధంగా ఆర్‌కేకు ఆర్థిక లాభాలు చేకూర్చే విధంగా జగన్‌ తగు చర్యలు తీసుకుంటారని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మధ్యాహ్నం 2గంటకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిసారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గంజి చిరంజీవిలు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
ఎందుకు మనసు మార్చుకున్నారు
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళుతూ నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వలేదని, అందువల్లే తాను పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడుతున్నట్లు గత నెలలో ప్రకటించారు. ఆ తరువాత వైఎస్‌ షర్మిలను కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. షర్మిలతో పాటు పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఉన్నట్లుండి మనసు మార్చుకున్నారు. తిరిగి వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గానికి నిధుల విడుదల సీఎం చూసుకుంటారని, ఇప్పటి వరకు మీరు స్వయంగా ఖర్చుచేసిన నిధులు కూడా తిరిగి ప్రభుత్వం నుంచి ఇప్పిస్థారనే హామీ బలంగా వచ్చినట్లు సమాచారం.
మధ్యవర్తిగా విజయసాయి
రాష్ట్రంలో టీడీపీని చావుదెబ్బ కొట్టడంతో పాటు కాంగ్రెస్‌ను అడుగు ముందుకు వేయకుండా చేసే వ్యూహంలో భాగంగానే ఆళ్లను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు జగన్‌ ఆలోచించినట్లు విశ్వసనీయ సమాచారం. విజయసాయిరెడ్డి ద్వారా ఆళ్ల డిమాండ్లకు ఆమోదం తెలిపి తిరిగి పార్టీలోకి రావాలని కోరినట్లు వైఎస్సార్‌సీపీలోని ఆళ్ల సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆర్‌కె మంగళవారం సీఎం వైఎస్‌ జగను కలిసారు. సీఎం ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.
లోకే ష్‌ను ఓడించే వ్యూహమా?
ఆళ్లను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం వెనుక సీఎం జగన్‌ వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. లోకేష్‌ను ఓడించేందుకు ఆళ్ల సరైన వ్యక్తి అని, అయితే ఆయనకు మంగళగిరి టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అనే విషయాలు పక్కనబెట్టి లోకేష్‌ ఎక్కడ పోటీ చేసినా గెలవకుండా అడ్డుకునే బాధ్యతలను ఆర్‌కేకు అప్పగించినట్లు సమాచారం. అందుకు ప్రత్యేకించి ఏ విధమైన వ్యూహాన్ని రూపొందిస్తారు? లోకేష్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఎదురు చూడాల్సిందే.
సీఎం జగన్‌ను తిట్టాలన్నది నిజమేనా?
కాంగ్రెస్‌ పార్టీలో ఒక పద్దతి పాడూ లేదు. సీఎం జగన్‌ను తిట్టాల్సిందేనని షర్మిల చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆదేశించింది. అది నాకు నచ్చలేదు. జగన్‌ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేశాడు. వ్యక్తిగత దూషణలు వద్దని షర్మిలతో పాటు పార్టీ వారికి చెప్పాను. కానీ అవేమీ వారు పట్టించుకోలేదు. జగన్‌ను వ్యక్తిగతంగా దూషించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమెతో నడవడం ఇష్టంలేక సొంత గూటికి వచ్చినట్లు ఆళ్ల ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
Next Story