వైసీపీకి ఆళ్లనాని రాజీనామా.. కారణం అదేనంటూ..
x

వైసీపీకి ఆళ్లనాని రాజీనామా.. కారణం అదేనంటూ..

వైసీపీ పార్టీకి ఒకదాని తర్వాత ఒక ఝలక్ తగులుతూనే ఉంది. మొన్నే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు.. పార్టీకి రాజీనామా చేశారు. దాని నుంచి కోలుకోకముందే మరో కీలక నేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.


వైసీపీ పార్టీకి ఒకదాని తర్వాత ఒక ఝలక్ తగులుతూనే ఉంది. మొన్నే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు.. పార్టీకి రాజీనామా చేశారు. దాని నుంచి కోలుకోకముందే మరో కీలక నేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయన ఆళ్లనాని. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీలో కీలకంగా వ్యవహించిన నేత ఆళ్లనాని తన రాజీనామా నిర్ణయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పదవికి కూడా రాజీనామా చేశారు. తాను ఒకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. అందుకే రాజీనామా చేశానని, అందుకు వ్యక్తిగత విషయాలే కారణమని వివరించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.

ఆళ్లనాని ప్రస్థానం..

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్లనాని.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీజే చదువుతూ మధ్యలోనే చదువుకు స్వస్తి పలికారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2004లో మళ్ళీ ఎన్నికల రంగంలో నిలబడిన ఆయన ఈసారి ఘనవిజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆళ్లనాని. 2009 ఎన్నికల్లో కూడా ఏలూరు ఎమ్మెల్యేగా ఆయనే ఎన్నికయ్యారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో ఆయనను మరోసారి ఓటమి పలకరించింది. దాంతో 2017లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్.. ఆళ్లనానికి మంత్రి బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆళ్లనాని.. మళ్ళీ ఓటమిని రుచిచూశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరం పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Read More
Next Story