వీళ్లింట్లో పిల్లి చనిపోయిందా? అయితే వాళ్ల పనే!
x

వీళ్లింట్లో పిల్లి చనిపోయిందా? అయితే వాళ్ల పనే!

ఆరోపణల సీజన్ వచ్చేసింది… దాంతోపాటు కోతల కాలం మొదలైపోయింది. ఎన్నికల వేళ రాజకీయ నేతల.. ఆరోపణలు, కోతలతో జనం విసుకు చెందుతున్నారా...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఓ ఇంట్లో పిల్లి మృతి చెందింది.. దీనికి కారణం వైసిపి ప్రభుత్వం… ముఖ్యమంత్రి జగన్. ఇది టిడిపి ఆరోపణ... ఆ పిల్లిని టిడిపి కుట్ర పన్ని చంపేసింది. దీనికి టిడిపి అధినేత చంద్రబాబు బాధ్యత వహించాలి. ఇది వైసిపి ఆరోపణ… పాపం పిల్లి అనారోగ్యంతో చనిపోయింది. కానీ తన మరణం ఎన్నికల సమయంలో ఇంతటి రాజకీయ దుమారానికి కారణమవుతుందని కలలో కూడా అనుకోలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇందుకు అద్దం పడుతోంది. ప్రతి చావు తమ కోసమే అన్నట్టు ప్రధాన పార్టీలు రాజకీయం చేసేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ఘర్షణలు, దాడులు జరిగితే ఇది మీ గూండాల పనే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఇక చావుల్ని కూడా వదలడం లేదు. మనస్తాపంతో ఓ మహిళ మృతి చెందితే ఈ చావుకు కారణం మీరంటే మీరు అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు నానా రాద్ధాంతం చేశారు.

విశాఖ డ్రగ్ కంటైనర్‌తో ఏ పార్టీకి సంబంధం ఉంది...

ఇటీవల సీబీఐ అధికారులు విశాఖలో ఓ డ్రగ్ కంటైనర్‌ను పట్టుకున్నారు. అదే మామూలు సమయంలో అయితే రాజకీయ పార్టీల్లో పెద్ద రియాక్షన్ ఉండేది కాదేమో... ఎలక్షన్ సీజన్ కావడంతో... డ్రగ్ మాఫియాకు టిడిపికి సంబంధం ఉందంటూ వైసీపీ... వైసిపి నేతలే డ్రగ్ రవాణా వెనక సూత్రధారులంటూ టిడిపి... ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశాఖ పోర్టులో సీబీఐ అధికారులు 25 వేల కేజీల డ్రై ఈస్ట్ పౌడర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్టు ఇంటర్పోల్ సమాచారంతో పట్టుకున్నారు. ఈ డ్రై ఈస్ట్ పౌడర్‌ను దిగుమతి చేసిన సంధ్య ఆక్వా కంపెనీపై కేసు పెట్టారు. అంతే ఇక రాజకీయ దుమారం రేగిపోయింది. అంతకుముందు వైసీపీ నేత విజయసాయిరెడ్డి బ్రెజిల్ వెళ్లి రావడం... ఈ డ్రగ్స్ కంటైనర్ కూడా బ్రెజిల్ నుంచి రావడంతో రెండిటికి ముడిపెట్టి డ్రగ్స్ మాఫియాకు వైసీపీకి సంబంధం ఉందంటూ టిడిపి, జనసేన పార్టీలు తీవ్ర ఆరోపణలకు దిగాయి. సంధ్య ఆక్వా టెక్ నిర్వాహకులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో డ్రగ్స్‌తో టిడిపి, బిజెపికి సంబంధాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది.

రాజకీయమైన మహిళ మృతి...

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గోతి గీతాంజలి దేవి.. జగనన్న గృహాలపై ప్రభుత్వాన్ని అభినందిస్తూ మాట్లాడారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ట్రోల్స్ చూసి మనస్థాపానికి గురైన గీతాంజలి దేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతే ఎన్నికల సమయం కావడంతో ఇది రాజకీయమైపోయింది. ఆమె చావుకు టిడిపి, జనసేనలే కారణం అంటూ వైసిపి నేతలు ఆరోపణలు గుప్పించారు. అంతటితో ఆగకుండా స్వయాన హోమ్ మినిస్టర్ సుచరిత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగట్టారు. అయితే ఈమె చావు అధికార పార్టీ అత్యుత్సాహమే అంటూ టిడిపి జనసేనలు ఎదురుదాడికి దిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎప్పుడో చనిపోయిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వివేకానంద హత్య కేసు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారింది. 'ప్రస్తుతం రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చూస్తుంటే వీళ్ళా మనల్ని పాలించేది అనిపిస్తుంది. ఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే.. ప్రస్తుతం దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయనే చెప్పాలి' అని జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం. వినయ్ ప్రకాష్ తన అభిప్రాయాన్ని ది ఫెడరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

కోతల కాలంలో నేతలు...

కోతల కాలం అంటే అందరికీ గుర్తొచ్చేవి పంట చేతికొచ్చాక కోసే కాలమని... కానీ మనం చెప్పుకోబోయే ఈ కోతల కాలం అలాంటిది కాదు. సహజంగా గ్రామాల్లో బడాయి కబుర్లు చెప్పే వారిని కోతల రాయుళ్లు అని పిలిచేవారు. అంటే వీరు చెప్పే మాటలకకు చేష్టలకు పొంతన ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకునే కోతల కాలం రాజకీయ కోతల కాలం... ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు కోసే కోతలు గురించి...

ఎన్నికల సమయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. అయితే ఓటర్లను ఆకర్షించేందుకు... నేతల కోతలు కోటలు దాటుతున్నాయి. ఐదేళ్ల పాలనలో నిధుల సమీకరణ, అభివృద్ధిని పక్కన పెట్టిన వైసీపీ ఎన్నికల సమయం రాగానే... తెగ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేసింది. సంక్షేమానికి పెద్దపీట వేసింది మా ప్రభుత్వమేనంటూ ప్రచారం సాగిస్తోంది. తమను మళ్లీ గెలిపిస్తే ఐదేళ్ల పాలనలో ఇచ్చిన దాని కంటే రెట్టింపు సంక్షేమ ఫలాలను అందిస్తామంటుంది. ఇక ప్రతిపక్ష టీడీపీ అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మారని రాష్ట్రాన్ని మరో సింగపూర్‌గా మారుస్తామంటున్నారు.

ఇక ఆయా పార్టీల నేతలు అయితే అమలు గాని హామీలను గుప్పిస్తూ ప్రచారంలో తెగ గొప్పలకు పోతున్నారు. అది చేస్తాం ఇది చేస్తామంటూ ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 'నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. ఆచరణ యోగ్యం కాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు విజ్ఞతతో మంచి చేసే నాయకులను ఎంచుకుంటే రానున్న కాలంలోనైనా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వీలు కలుగుతుంది' అని సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ ఎన్ సుబ్రహ్మణ్య శర్మ.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

Read More
Next Story