సీఎం రమేష్ ప్రచారంలో మిత్రపక్షాలేవి?
జట్టు కట్టారు...కలిసి పని చేయాలని ఒట్టు పెట్టుకున్నారు.. కానీ సీఎం రమేష్ ప్రచారంలో జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు ఏమయ్యారు...?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్నకు తొలి పూజ చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. సింహాచలం దేవస్థానంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమయ్యారు. సింహాచలం నుంచి అనకాపల్లి వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు.
కానరాని పొత్తు పార్టీలు…
బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారంలో మిత్ర పక్షాలు కనిపించలేదు. కేవలం బీజేపీ కార్యకర్తలు, జెండాలు తప్ప తెలుగుదేశం, జనసేనకు చెందిన ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో మిత్ర పార్టీల్లో సయోధ్య ఉన్నట్టు కనిపించడం లేదు. తొలిసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సీఎం రమేష్ మిత్రపక్షాలను పిలవలేదా? పిలిచినా వారు రాలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పొత్తు పార్టీల మధ్య సయోధ్యను ప్రశ్నిస్తుంది.
కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం మాదే....
రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ -జనసేన కూటమి...కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని బీజేపీ అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కూటమి విజయం తథ్యం.కేంద్రంలో మూడోసారి ఎన్‌డీఏ అధికారంలోకి రాబోతోంది' అని ప్రచారంలో భాగంగా సీఎం రమేష్ చెప్పారు. మిత్రపక్షాల సహకారంతో అనకాపల్లిలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే తొలి ప్రచార కార్యక్రమానికి మిత్రపక్షాలు హాజరు కాకపోవడం కొసమెరుపు.