వైసీపీ నుంచి మరో కీలక నేత జంప్..
వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. టికెట్ దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.
ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కిల్లీ కృపారాణి రాజీనామా విషయాన్ని మరువక ముందే మరో కీలక నేత పార్టీకి వీడ్కోలు పలికారు. బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు టికెట్ దక్కకపోవడమే ప్రధాన కారణమని సంచలన ప్రకటన కూడా చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనకు పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. తన భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తానని, ఈ నెల తొమ్మిదిన తాను ఏం చేయనున్నది ప్రకటిస్తానని చెప్పారు.
అయితే ఆమంచి టికెట్ దక్కకపోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా టికెట్ దక్కలేదన్న కారణంతోనే టీడీపీకి టాటా చెప్పి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన ఆమంచికి టికెట్ దక్కలేదు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. అందుకనే 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి విజయం సాధించారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు.
టికెట్ దక్కకపోవడమే కారణం
‘‘చీరాల నుంచి టికెట్ నాకే దక్కుతుందని ఆశించాను. కానీ పార్టీ అధిష్టానం మాత్రం నన్ను కాదని కరణం వెంకటేష్‌కు టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేసింది’’అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చీరాల నుంచి ఆమంచి పోటీకి దిగినప్పుడు టీడీపీ తరపున కరణం బలరాం పోటీకి దిగారు. కరణం బలరాం చేతిలో ఆమంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సంభవించిన పరిణామాల దృష్ట్యా కరణం బలరాం.. వైసీపీలో చేరారు. దాంతో కరణం, ఆమంచి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గ విభేదాలు తలెత్తాయి. దాంతో ఆమంచిని పార్టీ హైకమాండ్ పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆ టికెట్ విషయంలో కూడా ఆమంచికి ఎదురుదెబ్బ తగిలింది. పర్చూరు అభ్యర్థిగా యెడం బాలాజీని వైసీపీ ప్రకటించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమంచి.. పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ గూటికి ఆమంచి
టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో వైసీపీని వీడిన ఆమంచి.. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. సంబంధిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఆమంచి.. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారని, ఆయనకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసిందని, దాంతో కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యే ఆమంచి.. వైసీపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఈనెల 9న ప్రకటిస్తానని ఆమంచి తెలిపారు. మరి ఆ రోజున ఏం తేలుస్తారో వేచి చూడాలి.