ఏపి రాజకీయాల్లో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్‌ హాట్‌ టాపిక్‌. చీరాలలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పడిలేచిన కెరటం. ఆ గూటికే చేరుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో చీరాల నియోకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ అన్ని కులాల వారిని ఓటర్లు ఆదరించారు. యాదవ, కమ్మ, కాపు, వైశ్య వంటి కులాల వారు ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువ. అలాగే ఎస్సీల ఓట్లు కూడా ఎక్కువే. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బలరామకృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీలో చేరగా ఆమంచి చీరాలలో ఇమడలేకపోయారు. దీంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేలా చెలాయించారని చెప్పొచ్చు.

2024లో దక్కని సీటు
చీరాల నుంచి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే జగన్‌ మాత్రం చీరాలలో సీటు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పర్చూరు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. అక్కడి నుంచి తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయలేనని తేల్చి చెప్పడంతో ఎక్కడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారంలోకి రాగానే పార్టీలో మంచి పదవి ఇస్తానని జగన్‌ నచ్చజెప్పినా జీర్ణించుకోలేని ఆమంచి పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం పార్టీ వారికి చెప్పినా వారి నుంచి సరైన స్పందన రాలేదు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తిరిగి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా (నవోదయ పార్టీ) పోటీచేసినప్పుడు ఆటో గుర్తు వచ్చింది. ప్రస్తుతం ఆటోగుర్తు వేరే వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఓటర్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంటుందని భావించిన కృష్ణమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనకు స్వస్తిపలికారు.
తిరిగి సొంత గూటికి..
తాను 2009లో కాంగ్రెస్‌–ఐ ద్వారా పోటీ చేసి గెలిచినందున తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మనం కాంగ్రెస్‌లోకి వెళుతున్నామని క్యాడర్‌కు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి నేతృత్వం వహిస్తున్నది వైఎస్‌ఆర్‌ బిడ్డ షర్మిల కావడం వల్ల ఏ విషయమైనా అర్థం చేసుకుంటుందనే ఆలోచనకు వచ్చిన ఆమంచి ఆ వైపుగా పావులు కదిపారు. బాపట్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జెడీ శీలంతో మాట్లాడి ఆయన ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. చీరాల నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోకి వస్తున్నందున శీలం తెలిసిన వారు కావడం, ఎప్పటి నుంచో పరిచయాలు ఉండటం వల్ల ఆయన ద్వారా షర్మిలతో కూడా మాట్లాడారు. పార్టీలో చేర్చుకునేందుకు, చీరాల సీటు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమంచి సొంతగూటికి చేరుకున్నట్లవుతుంది.
జేడీ శీలం ద్వారా ముందుకు..
జేడీ శీలం ద్వారా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ డీకే శివకుమార్‌ చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయతో కలిసి మాట్లాడిన ఆమంచి ముఖ్యనాయకులందరి సూచనలు, సలహాలు తీసుకుని కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్యకు శిశ్యుడుగా పేరు తెచ్చుకున్నారు. రోశయ్య ద్వారా చాలా మంది ప్రజలకు చాలా పనులు చేయించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వద్ద కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనపై ఆమంచికి మంచి గౌరవం కూడా ఉంది. ఆయన మరణించిన తర్వాత రోశయ్యను పిలిపించి వైఎస్‌ఆర్‌ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు. ఆ విధంగా అటు వైఎస్‌ఆర్‌ ఇటు మాజీ సీఎం రోశయ్య రుణం తీర్చుకున్నట్లేననే సంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తన సొంత పార్టీ అనే భావనకు వచ్చారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి క్యాడర్‌ను దూరం చేసుకోవడం కంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపే లక్ష్యంగా పని చేయడం మంచిదనే ఆలోచనకు ఆమంచి వచ్చినట్లు సమాచారం.
పట్టుదలతో ఆమంచి వర్గం
ఎలాగైనా వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న కరణం వెంకటేష్‌ను ఓడించాలి. ఆమంచి గెలుపే లక్ష్యంగా పని చేయాలి. అనే ఆలోచనలో ఆమంచి వర్గం పకడ్బంధీగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పని చేసినందున ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఆమంచి ఏర్పాటు చేసుకున్నారు. నియోజక వర్గమంతా ఆయన కోసం తెగబడి పని చేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారనడంలో సందేహం లేదని ఆమంచి అనుచరులు చెబుతున్నారు.
ఆర్థికంగాను బలవంతుడే
నియోజక వర్గంలో ప్రచార ఖర్చులు కానీ.. ఇతర ఖర్చులకు కానీ వెనుకాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌పార్టీ కూడా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కొంత మొత్తం నిధులు సమకూర్చేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. ఇక పార్లమెంట్‌ అభ్యర్థి జేడీ శీలం కూడా ఆమంచి కృష్ణమోహన్‌ను ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతున్నందున ఇక గెలుపు ఎంత ముఖ్యమనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చారు.
9న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం
ఈనెల 9వ తేదీనా కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి ఆమంచి వచ్చినట్లు సమాచారం. గురువారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగానే చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌పార్టీ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
Next Story