ప్రజల డబ్బు పైసాలేకుండా అమరావతి రాజధాని మహానగరం నిర్మాణం. ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా?
ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ రాజధాని మహా నగరం నిర్మాణం కోసం భారీ ఆర్థిక వనరులు అవసరం. ఇప్పటి అంచనాల ప్రకారం మొదటి దశకు దాదాపు ₹48,000 కోట్ల నుంచి ₹64,721 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఈ నిర్మాణం కోసం ప్రజలు చెల్లించే పన్నుల డబ్బును ఉపయోగించకుండా నిర్మిస్తానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యమంత్రి చెబుతున్నమోడల్ ఏమిటి?
సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్
అమరావతి నిర్మాణంలో ప్రధాన ఆర్థిక వనరు భూమి. అమరావతి తొలినుంచి భూమి చుట్టూర తిరుగుతూ ఉంది. ప్రభుత్వం ఈ భూమి మానిటైజేషన్‌ను ఎంచుకుంది. 29 గ్రామాల్లోని 24,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) కింద అందజేశారు. ఈ భూముల్లో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి, వాణిజ్యపరంగా విక్రయించడం ద్వారా నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక యూనిట్ల కోసం భూమిని విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఆడబ్బును రాజధాని నిర్మాణానికి తీసుకున్న అప్పులను చెల్లించేందుకు వినియోగిస్తారన్నమాట.
ఈ విధానంలో ప్రజల పన్నులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమి విలువ పెరిగే కొద్దీ, ఆదాయం కూడా పెరుగుతుంది. రియల్ ఎస్టే ట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించి అమరావతి అప్పులు తీరుస్తారన్నమాట. రియల్ ఎస్టేట్ అంటేనే స్పెక్యులేటివ్ వ్యాపారం. మార్కెట్ అనిశ్చితి, ఆర్థిక మాంద్యం, లేదా కొనుగోలుదారుల కొరత వంటి సమస్యలు తలెత్తితే భూమి విలువ కూలిపోతుంది. రియల్ ఎస్టేట్ బుడగ పగిలిపోయి దేశాలు తలకిందులైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అమరావతిలో జరగదని గ్యారంటీ లేదు. అపుడు చంద్ర బాబు నాయుడు ప్రణాళిక విఫలమయ్యే ప్రమాదం ఉంది. అలాగే రైతులకు ఇచ్చిన వాగ్దానాలు (డెవలప్‌మెంట్ ప్లాట్లు, యాన్యుటీ) నెరవేర్చడంలో ఆలస్యం కావచ్చు.
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే : ఇఏఎస్ శర్మ
ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో నుంచి పైసా ఖర్చు చేయకుండా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడం అంటే ‘అరచేతిలో వైకుంఠం’ చూపించడమేనని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రముఖ ఆర్థిక వేత్త ఇఏఎస్ శర్మ అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజల డబ్బు లేదని ప్రభుత్వం చెబుతున్న అంశంపై ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడారు. మంత్రి నారాయణ చెబుతున్నది నూటికి నూరు పాళ్లు తప్పన్నారు. అప్పులు ఇచ్చే వారు గ్రాంట్ ఇవ్వరు కదా... ప్రభుత్వం అప్పు తీసుకున్నప్పు ప్రజలపై పడకుండా పాలకులు ఎలా తీరుస్తారు. ప్రజా సేవ చేయడానికి వచ్చారా? వ్యాపారాలు చేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు.
డాలర్ వ్యాల్యూ పెరినప్పుడల్లా ఇండియన్ రుపీ వ్యాల్యూ తగ్గుతూ వస్తుంది. అప్పుడు తీసుకున్న అప్పు కూడా పెరుగుతుందని చెప్పారు. పెరిగిన అప్పును చెల్లించకుండా ఆపడం సాధ్యం కాదన్నారు. గుడిసెలో ఉన్నా ప్రభుత్వాన్ని నడపొచ్చు. రాజరిక పోకడలతో నిర్మించిన భవనాల్లో ఉండి పాలన సాగించాలంటే ధనవంతమైన రాష్ట్రం కావాలి. అలా కానప్పుడు ఉన్నంతలో సర్థుకుని అడుగులు వేయాలన్నారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ పనులకు అమరావతి ఉపయోగ పడుతుందన్నారు. తాను కేంద్ర సర్వీసుల్లో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, ఈ సందర్భంలో ప్రభుత్వ నేత అద్వానీ నీ మాట్లాడుతూ నూతన రాజధానుల కోసం డబ్బులు ఇవ్వడం సరైంది కాదని చెప్పినట్లు ఆయన తెలిపారు.
"ఎన్డీ తివారీని ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రిగా నియమించినప్పడు అక్కడ సరిగా నడవని ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకుని పాలనాభవనాలుగా మార్చుకుని పరిపాలన సాగించారు. తివారీ ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి," అని శర్మ చెప్పారు.
"అమరావతిలో కపిల్ దేవ్ కు గోల్ఫ్ కోర్టు నిర్వహణకు భూమి ఇచ్చారు. ఆ ఆట ఎంత మందికి తెలుసు. ఏదైనా స్థానికులకు ఉపయోగ పడాలి. విదేశీయులకు కాదు. రైతుల భూములు లాక్కున్నారు. ఈ భూములపై ఆధారపడి జీవించే వారి జీవనం చిద్రమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంత మంది రైతులు స్వయంగా వ్యవసాయం చేసే వారు ఉన్నారు. ఎక్కవ మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ భూములపై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఆధారపడిన వారు లక్షల మంది ఉన్నారు. వీరికి అమరావతి ఫలాలు అందాలి. అవి అందుతాయా? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో బతికే పేద కూలీలంతా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి," అని ఇఎస్ ఎస్ శర్మ అన్నారు.
ప్రజల డబ్బుతో కాకుండా ప్రైవేట్ డబ్బుతో పాలన సాగిస్తున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో వీరి నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటారో అనుభవించే వారికి తెలుస్తుందని ఆయన హెచ్చరించారు.
అమరావతి భూములకు అత్యంత విలువ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత భూములకు అత్యంత విలువ వచ్చింది. ఇప్పటికే అమరావతిలో తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, ఇతర అసెట్స్ ఉన్నాయి. కూటమి అధికారం చేపట్టిన తరువాత పనుల వేగం పెరిగింది. శాశ్వతంగా సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణాలు జరగాల్సి ఉంది. అమరావతి మీదుగా రైల్వే లైన్లు మంజూరు అయ్యాయి. విజయవాడ పై భాగాన అమరావతి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులుదీం దాదాపు పూర్తయ్యాయి. దీంతో అమరావతి భూములకు విలువ పెరిగింది. గతంలో ఉన్న విలువ కంటే పదింతలు ఎక్కువైంది.
భూమే ప్రభుత్వానికి మనీ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతిలో రైతుల నుంచి పూలింగ్ ద్వారా తీసుకున్న భూమి డబ్బు బ్యాంకుగా మారింది. రాజధాని అవసరాలకు పోను మిగిలిన భూమిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును అప్పులు ఇచ్చిన బ్యాంకులకు తిరిగి ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ విషయం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి పది నెలలు పూర్తయింది. ఈ పది నెలల కాలంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు కూడా పలు అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా ప్రభుత్వం అవన్నీ అధిగమించింది.
రాజధానికి అప్పు ఇప్పించే విషయంలో కేంద్రం చొరవ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి అప్పులు ఇప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కేంద్రం ముందుగా చెప్పిన ప్రకారం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణం తీర్చే విషయంలోనూ కేంద్ర సహకారం ఉంటుందనే విషయం స్పష్టమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ సమయంలోనే ఈ విషయం స్పష్టం చేశారు. అందుకే ప్రజలపై అమరావతి నిర్మాణ భారాలు పడకుండా రాజధాని నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది.
బడా కంపెనీలకు వరం
రానున్న రోజుల్లో అమరావతి ఒక పెద్ద పరిపాలనా కేంద్రంగా మార నుంది. అంతే కాకుండా ఏపీలోని సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ పారిశ్రామికీకరణ జరగనున్నందున పెద్ద కంపెనీలు అమరావతిలో కార్యాలయాలు నిర్మంచే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కార్యాలయాలకు ప్రభుత్వం భూమి అమ్మింది. ఇకపై అలా అమ్మకుండా భూమిని బ్యాంకుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనకు వచ్చింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు కొందరు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు కియా కార్ల కంపెనీ వరంగా మారింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ లో ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. రానున్న రోజుల్లో తీర ప్రాంత మంతా పారిశ్రామిక వాడగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పెద్ద కంపెనీల వారందరికీ పరిపాలనా భవనాలు అమరావతిలో అవసరమవుతాయి. అన్ని ప్రాంతాలకు అమరావతి అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం.
ప్రజలను మభ్య పెట్టడమే: ఫ్రొఫెసర్ అంజిరెడ్డి
అమరావతిలో ప్రజల డబ్బు కాకుండా అప్పులు తెచ్చిన డబ్బుతో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పటం ప్రజలను మభ్య పెట్టటమేనని ఆచార్య నాగార్జున యూనివర్సి ఫ్రొఫెసర్ వజ్రాల అంజిరెడ్డి అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ, "అప్పులు ఏనాటికైనా రాష్ట్ర ప్రజలు భరించాల్సిందే. పైగా అమరావతిలో జరిగే నిర్మాణాలకు వేల కోట్లు రాష్ట్ర ప్రజల నుంచి తీసుకుంటూ కేవలం ఒక ప్రాంతానికి ఈ డబ్బును పరిమితం చేయడం కూడా మంచిది కాదు," క్ని ఆయన అన్నారు.
ఏదో ఒక రూపంలో సుమారు 40 ఏళ్ల కాలం ప్రజలు అప్పులు చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు.
"సాధారణ ప్రజలకు అప్పులు కడుతున్నామనే విషయం తెలియకుండానే వారు కడతారు . అమరావతి రిపోర్టులు, అధ్యయనాలు చేసి రీసెర్చ్ పేపర్స్ పరిశీలిస్తే కాని వాస్తవాలు అర్థం కావు. మేధావులకు తప్ప సాధారణ ప్రజలకు అర్థమయ్యే లోపు వారి జీవితం ముగుస్తుంది. అందరి నుంచి వసూలు చేసిన డబ్బును ఒక చోట ఖర్చు చేయడం ఏమిటి? ప్రజలను చూసి కాకుండా పాలకులను చూసి బ్యాంకులు డబ్బులు ఇస్తాయా? అని డా. అంజిరెడ్డి ప్రశ్నించారు.
అంతర్జాతీయ రుణాలు
ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సమీకరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ నుంచి (సుమారు ₹6,700 కోట్లు), ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి (సుమారు ₹6,600 కోట్లు), జర్మన్ బ్యాంక్ KfW నుంచి ₹5,000 కోట్లు, భారతదేశంలోని HUDCO నుంచి ₹11,000 కోట్లు రుణంగా పొందనుంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి రుణం పొందినట్లు ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ రుణాలు కేంద్ర ప్రభుత్వ హామీతో లభిస్తున్నాయి. 2024-25 బడ్జెట్‌లో కేంద్రం ₹15,000 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇది రుణ సౌకర్యం కింద అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
ఈ రుణాలు ప్రత్యక్షంగా రాష్ట్ర పన్ను ఆదాయం నుంచి తీసుకోరు కాబట్టి ప్రజలపై భారం పడదు. రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి భవిష్యత్తులో ఆదాయ వనరులు (భూమి విక్రయాలు లేదా స్థానిక పన్నులు) అవసరం. ఒకవేళ ఆదాయం సరిపడకపోతే, రాష్ట్ర ఆర్థిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది.
కేంద్ర సాయం, బాండ్లు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. 2014-19 మధ్య ₹1,500 కోట్లు, 2024లో ₹15,000 కోట్లు వంటి సహాయం అందింది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల ద్వారా నిధులు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.
కేంద్ర సాయం రాష్ట్ర పన్నులపై ఆధారపడదు. బాండ్లు మార్కెట్ నుంచి నిధులు తెచ్చే అవకాశాన్ని ఇస్తాయి.
బాండ్లపై వడ్డీ చెల్లింపులు భవిష్యత్తులో రాష్ట్ర బడ్జెట్‌పై ఒత్తిడి తెస్తాయి. కేంద్ర సాయం పరిమితంగా ఉంటే, అదనపు నిధుల కోసం రాష్ట్రం ఇతర మార్గాలను వెతకాలి.
స్థానిక ఆదాయ వనరులు
అమరావతి పూర్తయిన తర్వాత, స్థానిక పన్నులు (ప్రాపర్టీ టాక్స్, వాణిజ్య పన్నులు) ఇతర రుసుముల ద్వారా ఆదాయం పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉపయోగపడతాయి. దీర్ఘకాలంలో ఈ విధానం అమరావతిని స్వయం సమృద్ధిగా మార్చవచ్చు. నగరం పూర్తిగా అభివృద్ధి చెందే వరకు ఈ ఆదాయం అంతగా ఉండకపోవచ్చు.
వాస్తవికతపై ప్రశ్నలు
ప్రభుత్వం ‘న్నుల డబ్బు లేకుండా’ నిర్మాణం చేస్తున్నామని చెప్పినప్పటికీ కొన్ని వాస్తవాలు పరిశీలించాలి. రుణాలు తిరిగి చెల్లించడానికి భవిష్యత్తులో పన్ను ఆదాయం ఉపయోగించబడే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం లేదా భూమి విక్రయాలు విఫలమైతే, ప్రభుత్వం ప్రజల పన్నులపై ఆధారపడవలసి రావచ్చు. 2019-24 మధ్య YSRCP ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసినందున, ఇప్పటికే నిర్మించిన నిర్మాణాలు దెబ్బతిన్నాయి, దీనికి అదనపు ఖర్చు అవసరం అయింది.
అమరావతి నిర్మాణాన్ని పన్నుల డబ్బు లేకుండా సాధ్యం చేయడానికి ప్రభుత్వం భూమి మానిటైజేషన్, అంతర్జాతీయ రుణాలు, కేంద్ర సహాయంపై ఆధారపడుతోంది. ఈ విధానం సైద్ధాంతికంగా సాధ్యమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ పరిస్థితులు, ప్రణాళిక అమలు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ప్రజల పన్నులపై ప్రత్యక్ష భారం లేకుండా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నా, భవిష్యత్తులో రుణ ఒత్తిడి లేదా ఆకస్మిక ఆర్థిక అవసరాలు ఈ వాగ్దానాన్ని ప్రశ్నార్థకం చేయవచ్చు. అందువల్ల ఈ విధానం విజయవంతం కావాలంటే పారదర్శకత, సమర్థవంతమైన అమలు, ఆర్థిక జాగ్రత్తలు కీలక అంశాలుగా మారుతాయి.