ఏ వర్గాల కోసమైతే అవమానాలు భరించి అంబేద్కర్ రిజర్వేషన్ లు తెచ్చారో... ఆ రిజర్వేషన్ ల చిచ్చు అంబేద్కర్ ను అవమానించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రగులుతోంది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం ఆందోళనకు దిగుతోంది. మాలల బలం ఉన్న నియోజకవర్గాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. సాక్షాత్తూ ప్రధాన మంత్రే మంద కృష్ణ మాదిగ కు హామీ ఇచ్చి, ఆ హామీని నిలబెట్టుకున్నారు. దేశ వ్యప్తంగా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తెలంగాణ అమలుకు రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ త్వరలో అమలు కాబోతోంది. అయితే ప్రభుత్వం వద్ద ఒక క్లారిటీ కొరవడిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాల వారీగా రిజర్వేషన్ లు అమలు చేయాలనే ఆలోచన
ప్రభుత్వానికి మరో ఆలోచన కూడా ఉంది. కొన్ని జిల్లాల్లో మాదిగలు ఎక్కువగా ఉంటే మరికొన్ని జిల్లాలో మాలలు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల జిల్లాను యూనిట్ గా తీసుకుని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు అమలు చేస్తే ఏ వర్గానికి కూడా నష్టం జరిగే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. చేసేదేదో ముందుగానే చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే జనాభా లెక్కలు తేలే వరకు సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చారు. 2026లో జనాభా వివరాల సేకరణ జరుగుతుందని, ఆ తరువాత వర్గీకరణపై మరో సారి చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పింది.
ఎస్సీ కుల ఘర్షణలు
ఏపీలోని పలు జిల్లాల్లో మాల, మాదిగ కులాల మధ్య వర్గ పోరు జరుగుతోంది. మాలలు ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అలాగని మాలల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. తూర్పుగోదావరి జిల్లా నలజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని గాంధీ కాలనీలో రెండు రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట మెడలో చెప్పుల దండ వేశారు. అంబేద్కరిస్టులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎందరికో ఎన్నో అవకాశాలు కల్పించిన అంబేద్కర్ ను అవమానించిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు.
సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం
అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఈ విషయంలో డీజీపీతో ప్రత్యేకంగా చర్చించారు. ఇటువంటి సంఘటనలు జరగటానికి కారణాలు వెంటనే తెలియజెప్పాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుల కోసం పోలీసుల తీవ్ర గాలింపు
దూబచర్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముందు రోజు రాత్రి మాల సామాజిక వర్గానికి చెందిన వారు వర్గీకరణను వ్యతిరేకిస్తూ దూబచర్లలో ఆందోళన చేశారు. ఈ గ్రామం గోపాలపురం నియోజకవర్గంలో ఉంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం మాల సామాజిక వర్గానికి చెందిన మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం సీరియస్ గా తీసుకుని కారకులు ఎవరనే విషయంలో పోలీసులతో చర్చిస్తున్నారు. మాలలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నందున మాదిగలకు వ్యతిరేకంగా చేసి ఉంటారని కొందరు భావిస్తుంటే మాదిగలే కావాలని మాలలను ఇరికించేందుకు ఈ విధంగా చేసి ఉంటారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇందులో మరో కోణం కూడా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మాల, మాదిగ వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇది మంచి అవకాశమని జనసేన పార్టీలోని కొందరు ఈ విధంగా చేసి ఉంటారనే ప్రచారం కూడా నియోజకవర్గంలో జోరందుకుంది. అందుకే సీఎం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని, పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను అరెస్ట్ చేయాని గాలిస్తున్నారని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.