2024 డిసెంబరు 19న కూడా ఇదే అంశం మీద ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌లోని గురజాడ సమావేశ మందిరింలో జరిగిన సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావులు పాల్గొని మద్దతు పలికారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్ అని దీని గురించి పార్లమెంట్ ఉభయ సభల్లోను ప్రస్తావిస్తామని, అంతేకాకుండా భారత రాష్ట్రపతికి లేఖ రాస్తామని వెల్లడించారు.
ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జెరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రోల్లో ఉద్యమాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు, ధర్నాలు, యాత్రలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని కోరుతూ గతంలో ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో జ్ఞాన యాత్రను కూడా చేపట్టారు. ఢిల్లీలో కూడా పలు మార్లు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం’ అనే పుస్తకాన్ని రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, బ్రిటీష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల 1927లో ఏర్పడిన సైమన్ కమిషన్ దీని వాస్తవాన్ని గ్రహించి, 1935 ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని, అది అంబేద్కర్ కృషి వల్లే ఇది ఏర్పడిందని, అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియ లేదని, ఆర్బీఐ ఏర్పాటుకు మూల కారకుడైన అంబేద్కర్ ఫొటోను కరెన్నీ నోట్ల మీద ముద్రించాలని కొన్నేళ్లుగా పరుశురామ్ పోటారాలు సాగిస్తున్నారు.
భారత దేశంలో రిజర్వు బ్యాంకు ఎలా ఏర్పడిందో తెలుసా అంటూ 2021 మార్చిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ కీలక ప్రసంగం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ సయమంలో బ్రిటీష్ పాలనలో ఉన్న భారత దేశం నాడు తీవ్ర సంక్షోభానికి గురైందని, దాని నుంచి బయటపడేందుకు ఇంపీరియల్ బ్యాంకును 1921లో ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ ఆ సంక్షోభం నుంచి తేరుకోలేక పోయిందని, దీంతో అది విఫలయత్నంగానే మిగిలి పోయిందన్నారు. ఇదే సమయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇండియలో క్షీణిస్తున్న రూపాయి విలువను గురించి, దాని వల్ల భారతీయ సామాన్యడి జీవనం ఎంత దుర్భరంగా మారిందో, ఆర్థికంగా ఇండియా ఎలా నాశనం అయ్యిందో బ్రిటీషు వాళ్లకు తెలియజేసేందుకు పోటారాలు చేశారని, అందులో అంబేద్కర్ విజయం సాధించారని అన్నారు. దీనికి పరిష్కారంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరుతూ నాడు ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్’ పేరుతో అంబేద్కర్ రాసిన పుస్తకం ద్వారా హిల్టన్ కమిషన్‌కు సిఫ్పార్సు చేశారని తెలిపారు.
లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో దీనిపైన చర్చలు జరిపిన నాటి బ్రిటీష పాలకులు రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారని, సైమన్ కమిషన్‌కు రిజర్వు బ్యాంకు ఏర్పాటు బాధ్యతలను అప్పగించారని పార్లమెంట్‌లో వివరించారు. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ద్వారా ఆర్బీని ఏర్పాటు చేసినట్లు వైసీపీ ఎంపీ అనురాధ పార్లమెంట్‌లో వివరించారు. తర్వాత కాలంలో 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ద్వారా రిజర్వు బ్యాంకును జాతీయం చేశారని ఆమె తెలిపారు. ఆ విధంగా అంబేద్కర్ ఎంతో మేధోమథనం చేసి రిజర్వు బ్యాంకు ఏర్పాటుకు కృషి చేశారని, ఈ నేపథ్యంలో అంబేద్కర్ చేసిన పోరాటనికి, దార్శనికతకు నిదర్శనంగా, ఆయనను గౌరవిస్తూ ఇండియన్ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫొటోను ముద్రించి భారత జాతిపిత గాంధీతో సమాన గౌరవం ఇవ్వాలని ఆమె పార్లమెంట్‌లో కోరారు.
2022లో భారత కరెన్సీ మీద అంబేద్కర్ ఫొటో ఎందుకు వేయకూడదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. నాటి గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మీద పై చేయి సాధించేందుకు ఇండియన్ కరెన్సీ మీద ఫొటోల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దేవుళ్ల పేర్లు కేవలం దేవాలయాలకే పరిమితం చేస్తున్నారని, కరెన్సీ నోట్ల మీద గణేశుడితో పాటు లక్ష్మీ దేవి ఫొటో కూడా వేయాలని అరవింద్ కెజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపైన కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ.. కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫొటో ఎందుకు వేయొద్దంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు.
నాటి నుంచి భారత కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలనే ఉద్యమం భారత దేశంలో కొనసాగుతూనే ఉంది. మరో వైపు భారత దేశంలో అత్యంత దేశ భక్తుడు అంబేద్కర్ అనే సర్వేతో కేంద్రంలో పాగా వేసిన బీజేపీ ప్రభుత్వం దీని మీద ఎలా స్పదింస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. భారత కరెన్సీ నోట్ల మీద జాతి పిత మహాత్మ గాంధీతో పాటు అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించి అంబేద్కర్‌కు గౌరవం కల్పిస్తుందా? డిమాండ్‌ను తోసి పుచ్చుతుందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ చిత్ర పటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు ముందుకొస్తుందా? అనేది ఆసక్తి కరంగా మారింది.