అమిత్‌ షా వచ్చారు.. డీజీపీ బదిలీ అయ్యారు
x

అమిత్‌ షా వచ్చారు.. డీజీపీ బదిలీ అయ్యారు

ఎన్నికలకు సరిగ్గా ఏడు రోజులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌ డీజీపీని మార్చడం చర్చనీయాంశంగా మారింది.


సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో పర్యటించారు. టీడీపీ, జనసేనతో కలిపి కూటమిగా ఏర్పడ్డ బీజేపీ తమ అభ్యర్థి సత్యకుమార్‌ను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్ధతుగా ఆదివారం నిర్వహించిన సభకు అమిత్‌ షా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ బదిలీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం జగన్, డీజీపీ, సీఎస్‌లు కడప జిల్లా వాసులే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్‌ కడపకు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా, జవహర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ కూడా ఎన్నికల్లో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్నింటికీ తల ఊపుతూ కూటమికి చెందిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మొదటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తక్షణమే వారిని బదిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా చేశారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఆ ఇద్దరి అధికారులతో పాటు మరికొందరి ఉన్నతాధికారుల వ్యవహార శైలిని తప్పుపడుతూ ఎన్నికల విధుల నుంచి వారందరినీ తప్పించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తొలుత ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణ టాటాను బదిలీ చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న మిగిలిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడంలో జాప్యం నెలకొనడంతో ఇక బదిలీలు ఉండక పోవచ్చని అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే తాజాగా డీజీపీని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరో సారి ఫిర్యాదు చేశారా?
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరం రావడంతో డీజీపీ వ్యవహారాన్ని కూటమి నేతలు ఆయన దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అమిత్‌ షా రాష్ట్ర పర్యటనలో ఉండగానే డీజీపీని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాలను కూడా బదిలీ చేశారు.
డీజీపీగా ద్వారకా తిరుమలరావు?
1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీహెచ్‌ ద్వారకా తిరుమలరావును ఆంధ్రప్రదేశ్‌కు నూతన డీజీపీగా నియమించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈయన ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండి, వైఎస్‌ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో ద్వారకా తిరుమలరావు ఒకరు.
సీఎస్‌కూ బదిలీ వేటు తప్పదా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డిని కూడా బదిలీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్‌లను గతంలో మాదిరిగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ సిబ్బంది ఉన్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆయన అందుకు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా ఏప్రిల్‌లో కొంత మంది వృద్ధులు మృతి చెందారు. దీంతో మే నెలలో అయినా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని మరో మారు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎన్నికల సంఘం నడవలేని వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని, మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలిచ్చింది. అయినా ఈ విషయంలో కూడా సీఎస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే బ్యాంకుల వద్దకు వెళ్లిన పలు వృద్ధులు ఎండ తీవ్రతకు మృతి చెందినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌పైనా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
Read More
Next Story