సోషల్ మీడియాలో నేనూ ఒక బాధితురాలినే.. నాపై తప్పుడు ప్రచారం చేయించింది వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగి పోయేవి. నన్ను, సునీతను, మా అమ్మను ఎలా పడితే అలా సోషల్ మీడియాలో మాట్లాడారని వైఎస్ షర్మిల చెప్పారు. సోషల్ మీడియాలో మా మీద చెప్పినవన్నీ అబద్దాలే. అక్రమ సంబంధాలను అంట గట్టారు. బూతులు కూడా తిట్టారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. ఈ టీమ్ ఒక సైతాన్ సైన్యం తయారైంది. వీటికి చెక్ పడాలి. అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు. మా కుటుంబాల్లో పిల్లలకు సోషల్ మీడియాలోని పోస్టుల కింద కామెంట్లు చదవొద్దు అని మేము చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాకు ఒక లిమిట్ ఉండాలి. ఒక రెగ్యులేట్ ఉండాలి. చర్యలు అనుక్షణం కొనసాగాలి. ఇప్పుడు పోలీసులు పట్టుకున్న వాళ్లంతా విష నాగులే. కానీ వీళ్ల వెనుక అనకొండ ఉంది. ఆ అనకొండను పట్టుకోవాలి. శిక్షలు కఠినంగా ఉండాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుందని షర్మిల అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనకొండ అని షర్మిల పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం. పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అని ముందుగా చెప్పినా, విష నాగుల వెనుకున్న అనకొండను పట్టుకోవాలని చెప్పింది మాత్రం ఆమె అన్న జగన్‌మోహన్‌రెడ్డి గురించే అని ప్రజలు చర్చించుకోవడం విశేషం.