బాధ్యతలు స్వీకరించిన ఆనం.. ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు
x

బాధ్యతలు స్వీకరించిన ఆనం.. ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన రోజే రాష్ట్రంలోని ఆలయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన రోజే రాష్ట్రంలోని ఆలయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగం దగ్గర జల హారతులను ఇవ్వడాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కూడా వెల్లడించారు. ఈరోజు సచివాలయంలో పర్యాటనక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులతో కూడిన మంత్రుల బృందంతో ఆనం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించాలని కూడా నిర్ణయించామని వెల్లడించారు.

160 దేవాలయాల కోసం భారీ నిధులు

‘‘రెవెన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తాం. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోలు తీసి పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 160 దేవాలయాల ఆధునికీకరణ పనులకు సంబంధించిన దుస్త్రాలపై సంతకం చేశా. ఈ ఆధునికీకరణ కోసం రూ.113 కోట్ల సీజీఎఫ్ నిధులు విడుదల చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని రూ.1 కోటి సీజీఎఫ్ నిధులతో ఆధునికీకరిస్తాం. అభివృద్ధి చేయనున్న 160 దేవాలయాల్లో 147 ఆలయాలు ప్రాధాన్య దేవాలయాలు మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన 13 ఆలయాలు వెనకబడి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని వెల్లడించారు.

ధూప దీప నైవేద్యాలకు రూ.10వేలు

ధూపదీప నైవేద్యాల కోసం ఆలయాలకు అందిస్తున్న మొత్తం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రి ఆనం. ‘‘రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని రూ.50వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు అందిస్తున్న రూ.5 వేలను రూ.10వేలకు పెంచుతున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం కోసం సీఎం చంద్రబాబుకు పంపాం. త్వరలోనే జీఓ కూడా జారీ చేస్తాం. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.32 కోట్లు అదనపు భారం పడుతుంది’’ అని తెలిపారు.

‘నా ప్రథమ బాధ్యత అదే’

‘‘చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి కోసం అడుగులు వేస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. భగవంతుని ఆస్తులను పరిరక్షించడానికి సిద్ధంగా ఉంటాం. వాటి పరిరక్షణే నా ప్రథమ బాధ్యత, కర్తవ్యం. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి వరకూ దేవుని ఆస్తులను కూడా వదలకుండా దోచుకున్నారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో నివేదికలు తెప్పించుకుని మరీ చర్యలు తీసుకుంటాం. నెల్లూరు జిల్లాలో 2 ఆలయాలకు సంబంధించి విచారణ జరిపించి, ప్రాథమిక నివేదిక ఆధారంగా అందుకు బాధ్యులైన ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకుంటాం. సమగ్ర విచారణలో ఏ తప్పులు జరగలేదని తేలితే అధికారులకు విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తాం. దేవాదాయ శాఖలోని ఓ అధికారి సహాయంతో కొందరు విపక్ష ఎంపీలు, నాయకులు అనేక దురాగాతలకు పాల్పడ్డారు. వాటన్నింటిపై విజిలెన్స్ ఎంక్వరీ జరిపిస్తాం. విచారణ సమయంలో సదరు అధికారిని సస్పెండ్ చేశాం’’ అని వెల్లడించారు.

Read More
Next Story