అనంత వ్యక్తులకు .. " ఇండియా" తో పోటు తప్పదా..!?
ఆదర్శ నేతలు అందించిన గడ్డపై పట్టు కోసం ప్రస్తుత నాయకులు పోటీ పడుతున్నారు. వీరికి "ఇండియా" కూటమిలోని అభ్యర్థులు పోటుగా నిలిచారు.
(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)
తిరుపతి: సమరశీల పోరాటాలతో, ఆదర్శ కమ్యూనిస్టు ఉద్దండులను అసెంబ్లీ, పార్లమెంటుకు పంపించిన ఘనత అనంతపురం జిల్లా గడ్డ సొంతం. అలాంటి ప్రాంతంలో ప్రస్తుత అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు ఆధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారు. వీరికి "ఇండియా" కూటమిలోని సిపిఐ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వణుకు పుట్టిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు స్థానంలో అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి కూటమి అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా మారింది.
అనంతపురం పార్లమెంటు స్థానంలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల (ఎస్సీ), అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు స్థానంలో 17,47,912 మంది ఓటర్లలో 8,65,742 పురుషులు, 8,81,938 మహిళా ఓటర్లతోపాటు 232 ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 2009 నియోజకవర్గాల వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతపురం లోక్‌సభ స్థానంలో ఉన్న రాప్తాడు మండలం అనంతపురం రూరల్ మండలం కొంత భాగం, ఆత్మకూరు రూరల్ మండలాలు ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగమయ్యాయి.
అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ కూటమి తరపున పారిశ్రామికవేత్త అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈయనపై ఎం. శంకర్ నారాయణ.. వైఎస్ఆర్సిపి నుంచి పోటీలో ఉన్నారు. వీరిద్దరికి పోటీగా కాంగ్రెస్ పార్టీ వజ్జల మల్లికార్జునను బరిలోకి దించింది. అనంత పార్లమెంటు స్థానానికి జరిగిన 17 ఎన్నికల్లో పాత తరం కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన తరిమెల నాగిరెడ్డి 1957లో ప్రాథమిక వహించారు. మూడుసార్లు టిడిపి, 11 సార్లు కాంగ్రెస్ పార్టీ, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు.
ఈ ఎన్నికలకు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి మార్పు చేసి మాలగుండ్ల శంకరనారాయణను అభ్యర్థిగా బరిలోకి ముందుగానే దించింది. టిడిపి అభ్యర్థిని ఎంపిక చేయడం నుంచి నిన్న మొన్నటి వరకు బాలారిష్టాలు దాటలేదు. అనంతపురం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం టిడిపి నాయకుల మధ్య మెల్లమెల్లగా కుదిరిన సయోధ్యతో కలిసి ఉన్నట్లు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకులు ఎక్కువగా ఉన్నారు.
ఈ సామాజికవర్గం ఎటు మొగ్గితే అటు విజయం వరిస్తుంది. కాగా ఈ స్థానంలో వైఎస్ఆర్సిపి ఆరు శాసనసభ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. ఒకటి ఎస్సి మరొకటి బిసి వాల్మీకి సామాజిక వర్గం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపిలో ఏర్పడిన విభేదాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి రావడం వల్ల వి. ప్రభాకర చౌదరి మెత్తబడ్డారు. టిడిపి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడింది. వీరికి సిపిఐ అభ్యర్థి వల్ల ఓట్ల చీలికకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు.
రాయదుర్గం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి పై మాజీ మంత్రి టిడిపి అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవపై వైయస్సార్‌సిపి అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడుమధుసూదన్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. దీంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య పోరు జరుగుతుందనేది అందరికీ తెలిసిందే.
తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి మళ్లీ పోటీ పడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో కొంత భాగం అనంతపురం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఇక్కడి ఎన్నికలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వారిద్దరికీ పోటీగా మారారు. అందులో ప్రధానంగా వైఎస్ఆర్సిపి నుంచి తిరుగుబాటు చేసిన మహిళా నాయకురాలు ఉండటం గమనార్హం.
సింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులుతో టిడిపి అభ్యర్థిగా బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. వీరికి ఆర్థిక స్థిరత్వం లేకపోయినప్పటికీ ఆయా పార్టీల పెద్దలు అందిస్తున్న సహకారంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అలిమినేని సురేంద్రబాబు, వైయస్సార్సీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య తున్నారు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇంచార్జ్ వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లడం ఓ మైనస్ పాయింట్. బెంగళూరు టిడిపి ఐటి విభాగం ఈ నియోజకవర్గంతో పాటు రాయదుర్గంలో కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
యోధులను అందించిన అనంత ఓటర్లు
అనంతపురం.. చాలా ప్రాముఖ్యత కలిగిన పార్లమెంటు నియోజకవర్గాలలో ఒకటి. తొలి తరంలో కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివం, పైడి లక్ష్మయ్య వంటి గొప్ప గొప్ప నాయకులు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో ఉన్నారు. ఓసి స్థానంగా కొనసాగుతున్న ఈ నియోజకవర్గం నుంచి 1957లో సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన తరిమెల నాగిరెడ్డి 1952లో ద్విసభా నియోజకవర్గంగా ఉంది. 1967లో అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా తరిమెల గెలుపొందారు.
1962లో ఈ నియోజకవర్గం నుంచే సిపిఐ అభ్యర్థిగా గెలుపొందారు. 1967లో కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన నారాయణస్వామి 1983లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందిన అనంత వెంకటరెడ్డి.. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1969 ఉప ఎన్నికల్లోనూ, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1967లో ఇక్కడే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక్కడి నుంచి గెలిచిన అనంత వెంకట్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి తండ్రి కొడుకులు.
1999లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన కాల్వ శ్రీనివాసులు 2014లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2017లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు కాల్వ శ్రీనివాసులు. 2014లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన జేసి దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. ఈయన 1984లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రహదారులు భవనాల శాఖల మంత్రిగా 1990 లో జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా అదే శాఖను నిర్వహించారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా అదే శాఖ నిర్వహించడం గమనార్హం.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. దివాకర్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి 2014లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారుడు. 2014లో ఇక్కడ గెలిచిన జూటూరు చిన్నారెడ్డి.. దివాకర్ రెడ్డి 2019లో ఇక్కడ ఓటమిపాలైన జూటూరు చెన్నారెడ్డి.. పవన్ రెడ్డి తండ్రి కొడుకులు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి అత్యంత ప్రతిష్టాత్మక పోరు నడుస్తోంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు హోరాహోరిగా పోరాడుతున్నారు.