ఏపీలో ఓపెన్ యూనివర్సిటీ లేక పోవడం వల్ల పేద విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించాలంటే ఓపెన్ యూనివర్సిటీ రావాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ యూనివర్సిటీ లేదు. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. రెగ్యులర్ యూనివర్సిటీలు, కాలేజీల్లో భారీగా ఫీజులు చెల్లించి చదువుకునే పరిస్థితులు లేని వారికి ఓపెన్ యూనివర్సిటీ వరంగా పలువురు విద్యా వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఇప్పటికీ అందుకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం తేలలేదు. పదేళ్లు గడవడంతో యూనివర్సిటీ మాదేనని తెలంగాణ వారు తేల్చి చెప్పారు. అయినా ఏపీ పాలకులకు ఇవేమీ పట్టలేదు. రాజకీయాలపై చూపించే చొరవ విద్యారంగంపై చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలేజీలకు వెళ్లలేని ఎంతో మందికి ఓపెన్ యూనివర్సిటీ వరంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఎందుకు ఓపెన్ యూనివర్సిటీ కావాలి...
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో పలు కోర్స్ లు నిర్వహిస్తున్నారు. అయినా ఓపెన్ యూనివర్సిటీ అవసరం ఏమిటనేది పలువురి ప్రశ్న. ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీలు దూర విద్య కోర్స్ లు నిర్వహించేందుకు ఆ జిల్లా వరకే పరిమితం ఉంది. వేరే జిల్లాల వారు యూనివర్సిటీకి వెళ్లి వారాంతం క్లాసుల్లో పాల్గొనాలంటే పేద వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. రోజూ కూలి పనులు చేసుకునే వారికి కూడా ఇబ్బందులు తప్పవు. పైగా ఫీజుల భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజులు ఉంటాయి. అందుకే ఓపెన్ యూనివర్సిటీ కావాలని విద్యార్థులు కోరుతున్నారు.
లాభాలు ఏమిటి?
1 సాధారణంగా రెగ్యులర్ కోర్స్ లు చదివే వారు ఏడాదికి 180 రోజులు తప్పకుండా కాలేజీకి హాజరు కావాలి. ఆ అవసరం ఓపెన్ యూనివర్సిటీ వారికి ఉండదు.
2 గృహిణిలు, షాపుల్లో, మాల్స్ లో పనిచేసే చిన్న ఉద్యోగులు, డెలివరీ బాయిస్, కూలి పనులు చేసుకునే వారు, పగటి పూట ఉద్యోగాలు చేసుకునే వారు ఓపెన్ లో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.
3 ఫీజులు విపరీతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. డిగ్రీ చదువుకునే విద్యార్థి ఏడాదికి ఓపెన్ యూనివర్సిటీలో రూ. 2500 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అదే ఇతర కాలేజీల్లో అయితే పది వేల వరకు ఫీజు ఉంటుంది. సాధారణ బిఎ డిగ్రీని అన్ని ఖర్చులతో కలిపి రూ. 12వేలతో పూర్తి చేయవచ్చు.
4 సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఓపెన్ యూనివర్సిటీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదాహరణకు ముస్లిమ్ యువతులు నిత్యం కాలేజీల్లో చదువుకునేందుకు తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది చదువుకు దూరం అవుతారు. ఓపెన్ లో ఆ పరిస్థితులు లేవు. ఇంటి నుంచే చదువుకోవచ్చు.
5 పుస్తకాలు ఓపెన్ యూనివర్సిటీనే ఇస్తుంది. ఇదే ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
6 ప్రభుత్వం ఓపెన్ యూనివర్సిటీకి ఏడాదికి రూ. 15 కోట్లు ఖర్చు చేస్తే సాధారణ యూనివర్సిటీకి వంద కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ కాలేజీల్లోని లెక్చరర్ల చేత వారానికి రెండు సార్లు క్లాసులు చెప్పించి వారికి నెలకు రూ. 3వేలు ఇస్తాము. కానీ ఫ్రొఫెసర్ లకు కనీసం రూ. 1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు నెల జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులు ఓపెన్ యూనివర్సిటీకి ఉండవు. రిటైర్డ్ ఫ్రొఫెసర్ లను ఉపయోగించుకుంటారు.
7 విద్యార్థి నేరుగా యూనివర్సిటీ ద్వారా చదువుకోవాలంటే డిగ్రీ ఖర్చు కనీసం రూ. 50వేల వరకు ఉంటుంది. అదే ఓపెన్ యూనివర్సిటీలో అయితే రూ. 12వేలతో పూర్తవుతుంది.
ఓపెన్ లో తెలంగాణలో చదువుతున్నఏపీ విద్యార్థులు 30 వేల మంది
8 చిన్నతనంలో చదువు అబ్బక ఇప్పుడు తప్పకుండా చదువుకుందామని అనుకునే వారికి ఓపెన్ యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ప్రస్తుతం తెలంగాణలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు 30 వేల మంది వరకు ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా వేరే రాష్ట్రాల వారు చేరేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఓపెన్ యూనివర్సిటీలకు ఆ రాష్ట్రం వరకు విద్యార్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వేరే రాష్ట్రాలకు చెందిన వారికి అడ్మీషన్ లు ఇచ్చి చేర్చుకుంటే చివరకు వారి రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు ఉద్యోగాలకు అనర్హులను చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో గ్రూప్ 1 రాస్తున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోనే ఓపెన్ యూనివర్సిటీ విద్యను పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టింది. వేరే రాష్ట్రాల్లో ఓపెన్ కోర్స్ లు చేసిన వారిపై అనర్హత వేటు వేసింది. అందువల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీ ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది. వేరే రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీ విద్యను అభ్యసించిన వారు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలకు అర్హులు కాదనే నిబంధన మంచిది కాదని, అన్ని ప్రభుత్వాలు ఈ విషయంలో మంచి ఆలోచన చేసి ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షలకు అనుమతించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో ఓపెన్ యూనివర్సిటీ ఉంటే...
ఏపీలో ఓపెన్ యూనివర్సిటీ ఉండి ఉంటే ఇప్పటికి యూనివర్సిటీ పరిధిలో కనీసం 60వేల మంది పైన అడ్మిషన్ లు తీసుకుని చదువుతుండే వారు ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలోనే ఓపెన్ యూనివర్సిటీలో 30 వేల మంది చదువుతున్నారంటే సొంత రాష్ట్రంలో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. పైగా సొంత రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీ చదివిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీలో చదువుకున్న ఎంతో మంది గృహిణులు ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసిన రమణాచారి కూడా ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఎ తెలుగు పూర్తి చేశారు. ప్రస్తుతం మహిళా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉన్న వారిలో చాలా మంది ఓపెన్ లో డిస్టెన్స్ చేసిన వారే.
ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా 1982లో ఓపెన్ యూనివర్సిటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ లో ప్రారంభించింది. కేవలం ఫౌండేషన్ స్టోన్ కే పరిమితమైంది. ఆ తరువాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 1983లో హైదరాబాద్ కు తరలించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పేరు పెట్టి ముందుకు నడిపించింది. అప్పట్లో పలు విద్యార్థి సంఘాలు ఓపెన్ యూనివర్సిటీ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా అప్పట్లో పనిచేసిన టి లక్ష్మినారాయణ నేతృత్వంలో నడిపిన మిలిటెంట్ పత్రికలోనూ ఓపెన్ యూనివర్సిటీ ప్రాధాన్యత గురించి వివరించారు. మిలిటెంట్ కు ఆయన నాడు ఎడిటర్ గా ఉన్నారు.
టి లక్ష్మినారాయణ ఫెడరల్ తో మాట్లాడుతూ తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో చాలా మంది నాడు డిస్టెన్స్ కోర్సులు పూర్తి చేసే వారు, కొన్ని కోర్స్ లకు ఉద్యోగానుమతి ఉండేది. కొన్నింటికి ఉండేది కాదు. ఇప్పటికీ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీ ప్రాధాన్యత ఏపీకి ఎంతో ఉందన్నారు. తక్కువ ఖర్చుతో పేద విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయవచ్చునని, పదో తరగతి పాసైన వారు నేరుగా డిగ్రీ రాయొచ్చునని చెప్పారు. ఓపెన్ లో కూడా ఇప్పుడు అన్ని కోర్స్ లకు అనుమతి ఉందన్నారు. పీజీ కోర్స్ లు, వివిధ రకాల డిప్లొమా కోర్స్ లు, పిహెచ్ డీ కోర్స్ లు కూడా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు.