ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఇలా..
ఆంధ్రలో ఎన్నికల ప్రచార జోరు రోజురోజుకు పుంజుకుంటుంది. ప్రతి పార్టీ తమ ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నాయి. వేసవిలో ఎండను కూడా లెక్క చేయకుండా..
ఆంధ్రలో ఎన్నికల పండగకు రెండు వారాల సమయం కూడా లేదు. ఉన్న ఈ తొమ్మిది రోజుల్లో రాష్ట్రమంతా కలియతిరేగాయాలని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అందులో భాగంగా తమ ప్రచారాలను కూడా ముమ్మరం చేశాయి. మొన్నటి వరకు ఒకటి రెండు సభలు పెట్టిన వారు కూడా ఇప్పుడు రోజుకు మూడుకు తగ్గకుండా సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తూ, ప్రజలపై వరాలు కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి, వైసీపీ తమ మేనిఫెస్టోలను కూడా విడుదల చేసేశాయి. ఇక కాంగ్రెస్ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఈరోజు ఎవరు ఎక్కడ పర్యటించనున్నారు. ఎక్కడెక్కడ సభలు నిర్వహించనున్నారంటే..
వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సరసాపురం పార్లమెంటు పరిధిలోని సరసాపురం స్టీమర్ సెంటర్‌లో ఆయన ప్రచారం చేయనున్నారు. అక్కడ సభను కూడా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:20 గంటలకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో రెండు సభను, మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరిలోని పామూర్ బస్ స్టాండ్ సెంటర్‌లో మూడో సభను నిర్వహించి ఆయా సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వారు నెల్లూరు చేరుకుంటారు. అక్కడే ఓ సభను కూడా నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆమె ఈరోజు ఉదయం 9 గంటలకు ఆమె కడపలోని డీసీసీ కార్యాలయంలో ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు.