ఉమ్మడి రాజధాని కొనసాగింపుకు హైకోర్టు నో
x
Source: Twitter

ఉమ్మడి రాజధాని కొనసాగింపుకు హైకోర్టు నో

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు కొనసాగించాలన్న పిటిషన్‌ను ఆంధ్ర హైకోర్టు కొట్టేసింది. తమకూ అధికార పరుధులు ఉన్నాయని పెర్కొంది న్యాయస్థానం.



హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విషయంలో ఆంధ్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ కొట్టివేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉన్నాయని, పార్లెమెంటును తామెలా ఆదేశిస్తామని ఎదురు ప్రశ్నించింది. ఒక అంశంపై ఆదేశాలు జారీ చేయడం అనేది అందరూ అనుకుంటున్నంత సులభం కాదని తెలిపింది. దీంతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలన్న అంశానికి ఫుల్ స్టాప్ పడింది.

రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఆంధ్ర, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా వెల్లడించారు. ఆ సమయం ముగియనుండటంతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు కొనసాగించాలని కోరుతూ ఆంధ్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇందులో భాగ్యనగరాన్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి అనిల్ కుమార్ పిటిషన్‌లో కోరారు. విభజన చట్టంలోని పలు నిబంధనలను అనుసరించడంలో కేంద్రం విఫలమైందని, అప్పులు, ఆస్తులు, కంపెనీలు, కార్పొరేషన్లు విభజన ఇప్పటికీ పూర్తి కాలేదని, అవి పూర్తికావడం కోసం హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అనిల్ కుమార్ కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇందుకు నిరాకరించింది. తమకూ పరిమితులు ఉన్నాయని, ఒక విషయంపై చట్టం చేయాలని కేంద్ర హోంశాఖను తామెలా ఆదేశిస్తామని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న యోచనలో పిటిషనర్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అతి త్వరలోనే సుప్రీంలో పిల్ దాఖలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
కానీ సుప్రీం కోర్టు నుంచి కూడా ఇదే విధంగా స్పందన రావొచ్చని, కేంద్ర హోంశాఖను ఆదేశించడానికి సుప్రీం కోర్టు కూడా నిరాకరిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ విషయంలో సదరు పిటిషనర్ ప్రభుత్వాల ద్వారా వెళ్లడమే సుగమమైన చర్య అవుతుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర పెద్దల ముందు ఉంచడం ద్వారా ఏమైనా మేలు జరిగే అవకాశాలు ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Read More
Next Story