ఐపీఎల్‌కు 25 మంది యువ క్రీడాకారులను పంపాలన్నదే లక్ష్యం. 3 క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు.


గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి, వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో మూడు చోట్ల క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. ఆంధ్ర నుంచి 25 మంది యువ క్రీడాకారులను ఐపీఎల్‌లో ఆడేవిధంగా తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో గురువారం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం కేశినేని శివనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి క్రికెట్‌ స్టేడియం అభివృద్ధితో పాటు, రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి సంబంధించి 16 అంశాలపై చర్చించామన్నారు. అనంతపురం, విజయనగరం, మూలపాడులో క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారుల కోసం మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

వైజాగ్, మంగళగిరి స్డేడియంలలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. దీని కోసం గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ స్టేడియం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కన్సల్టెంట్లను నియమించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా మంగళగిరి క్రికెట్‌ స్టేడియం నిర్లక్ష్యానికి గురై నిర్మాణాలు దెబ్బతిన్నాయన్నారు. మంగళగిరి స్టేడియం వద్ద పార్కింగ్‌ సదుపాయాల్లేవు. పార్కింగ్‌ కోసం 14 ఎకరాలు, స్పోర్ట్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం 35 ఎకరాలు స్థలం కావాలని ప్రభుతం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదేవిధంగా స్టేడియం వచ్చే రహదారులను ఆధునీకరిస్తామన్నారు. మంగళగిరి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అండర్‌–12 క్రికెట్‌ టోర్నమెంట్‌ను తీసుకొస్తాము. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌ టోర్నమెంట్స్‌ పెంచేలా కృషి చేస్తామన్నారు. 175 నియోజక వర్గాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేలా సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సానా సతీష్‌ బాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ పి వెంకట రామ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌ దంతు గౌరు విష్ణు తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story