' ఇది జగన్ అహంకారాన్నిఅరాచకాన్ని తిరస్కరించడమే....’
"వైఎస్ ఆర్ కాంగ్రెస్ విధానాల వల్ల రాష్ట్రాభివృద్ది కుంటువడిందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. అందుకే జగన్ నాయకత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు."
గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ వైకాపా పాలన అహంకారపూరితంగా అరాచకంగా, అవినీతిమయంగా, అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరస్కరించారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకుండా,13.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలో ఉంచటం పై ఆంధ్ర ఓటర్లు ఆగ్రహించారన్నారు.
నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడటం, పెట్టుబడులను ఆకర్షించకపోవటం, పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఇసుక, మట్టి, మైనింగ్, ఎర్రచందనం మాఫియాలను పెంచి పోషించడం, ఉద్యోగ, ఉపాధి కల్పన ను కల్పించకపోవడం, ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలను ధ్వంసం చేయడం, భూ కబ్జాలు పెరగటం, పంచాయితీలను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం, ప్రత్యర్థుల పై దాడులు, ప్రతీకార్య చర్యలు కొనసాగించడం, మద్యం ధరలు పెంచి కల్తీ మద్యాన్ని అందించటం, కులాల మద్య, ప్రాంతాల మద్య చిచ్చు పెట్టడం, అవినీతి పరా కాష్టకు చేరటం,రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు,ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకపోవటం జగన్ మోహన్ రెడ్డి అపకీర్తి పాలయ్యేందుకు కారణమని ఆయన అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సర కాలంలో సచివాలయానికి కేవలం మంత్రివర్గ సమావేశాలకు మాత్రమే హాజరు అయ్యేవారని,ఇలా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి గతంలో ఎపుడూ లేరని లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి మాయమయిందని చెబుతూ రోడ్లను అధ్వానంగా ఉంచటంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.
"వివేకానంద రెడ్డి హత్య ,కోడి కత్తి డ్రామాలను ప్రజలు గమనించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సర కాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం, ప్రజా వేదిక కూల్చివేత తో విధ్వంసాలను రెచ్చగొట్టడం, ఎస్సీ, ఎస్టీ, రైతుల పథకాలను రద్దు చేయటం,ముఖ్యమంత్రి కి ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరి సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ఉంచటం లాంటి పరిస్థితులను గమనించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైకాపా పాలనకు ముగింపు పలికినారు," అని ఆయన అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమిని గెలిపించారని చెబుతూ ప్రభుత్వ పథకాలకు బ్రతికి ఉన్న జగన్ పేరు పెట్టడం, ప్రజల డబ్బు ప్రజలకుకిచ్చి ఉచిత పథకాలతో ఓట్లు కొనుగోలు చేయాలనే దుగ్ధను ప్రజలు గమనించారన్నారు.
"భూమి హక్కు చట్టంపై ప్రజలు ఆగ్రహించారు. వైకాపా అభ్యర్థులను ఉద్యోగులను మార్చినట్లు వివిధ నియోజకవర్గాలకు బదిలీ చేయడం నష్టం కలిగింది .వైకాపా పార్టీకి నిర్మాణం లేదని, కమిటీలు, సభ్యత్వం, సమీక్షలు లేవు, ఆధునిక రాజుగా వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనించారు.. భవిష్యత్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. విద్యుత్ ధరలను గణనీయంగా పెంచి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బినామీలకు వేలాది కోట్లు లబ్ధి చేకూర్చడాన్ని ప్రజలు అసహించుకున్నారు. అందుకే ఎన్నికల్లో ఆ పార్టీని ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు,"
Next Story