ఐదో సారి ఆంధ్రా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
x
ముఖ్యమంత్రి జగన్ కు బడ్జెట్ సూట్ కేసును అందిస్తున్న బుగ్గన

ఐదో సారి ఆంధ్రా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

ఆంధ్రా ఆదాయం రూ.2 లక్షల కోట్లు, ఖర్చు రూ.2.30 లక్షల కోట్లు జమా ఖర్చులు చెప్పారు. కాస్తంత లోటున్నా భరాయించే కెపాసిటీ ఉందంటూ లెక్కల చిట్టా విప్పారు.


ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్‌ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

రెవెన్యూ రాబడి రూ.2 లక్షల కోట్లు..


2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని పేర్కొంది. పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని పేర్కొంది. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత...

ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు బుగ్గన. మ్యానిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంలా భావించారన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమన్నారు. చాణుక్యుడిలా రాష్ట్రాన్ని సీఎం జగన్ పాలిస్తున్నారన్నారు. 1000 పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

ఇక జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని బుగ్గన చెప్పారు. రూ. 3,367 కోట్లతో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అందజేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాను 26కు పెంచామన్నారు. 52 రెవెన్యూ డివిజన్లను 77కు పెంచాశామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా గత ప్రభుత్వం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 35 లక్షల పిల్లలకు ప్రయోజనం చేకూర్చామన్నారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని ఈ సందర్భంగా బుగ్గన హర్షం వ్యక్తం చేశారు.

అంకెల్లో బడ్జెట్‌..

మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల 86 వేల 389 కోట్లు

ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు

మూలధన వ్యయం రూ.30,530 కోట్లు

ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు

రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు

జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం

జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం

పాలనా వికేంద్రీకరణ...

పాలనా వికేంద్రీకరణతో పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు మంత్రి బుగ్గన. “పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారత అందించాం. విద్యార్ధులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా పాఠశాల్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాం. వెయ్యి పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులను సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకువచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతీ విద్యార్థికి టోఫెల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నాం”

“కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా.. రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఆంధ్రప్రదేశ్‌ మారింది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు జగన్‌ ప్రభుత్వం చేసింది. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణాంధ్ర, సంక్షేమాంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రను సాధించాం. పాలనా పరమైన పునర్నిర్మాణంలో 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీస్‌ డివిజన్లు ఏర్పాటయ్యాయి. కొత్త రెవెన్యూ, పోలీస్‌ డివిజన్లను కుప్పంలోనూ ఏర్పాటు చేశాం.

నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు 34.30లక్షల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులయ్యారు. నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం. మొత్తం రూ.7,163 కోట్లు ఖర్చు చేశాం. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం. విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్థులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అందేలా చర్యలు తీసుకున్నాం” అన్నారు బుగ్గన.

Read More
Next Story