ప్రైవేటు లాడ్డీల దోపిడీకి చెక్ పెట్టేలా తిరుపతిలో మరో వసతి గృహం
x

ప్రైవేటు లాడ్డీల దోపిడీకి చెక్ పెట్టేలా తిరుపతిలో మరో వసతి గృహం

తిరుపతిలో భక్తులు వసతి గదుల కోసం ఇక్కట్లు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది


తిరుపతిలో భక్తులు వసతి గదుల కోసం ఇక్కట్లు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అలిపిరి వద్ద అత్యాధునిక హంగులతో ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌’ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఇక్కడున్న శిల్ప కళాశాలను మరో చోటకు తరలించి అందుబాటులో ఉన్న 20 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రైవేటు లాడ్జీలు చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తోంది.
తిరుమలలో స్థలం తక్కువగా ఉండటం, నీటి ఎద్దడి రోజురోజుకూ ఎక్కువ అవుతుండడంతో కొండపైన కొత్త గదుల నిర్మాణం సాధ్యం కాదన్న నిర్ణయానికి టీటీడీ వచ్చింది. 7,500 వరకు గదులున్నా ఏమాత్రం చాలడం లేదు. దీంతో కొండపై వసతి దొరక్క భక్తులు రోడ్లపైన, షెడ్లలోనూ పడిగాపులు కాయాల్సి వస్తోంది. లాకర్లలో వస్తుసామగ్రి దాచిపెట్టి దర్శనాలకు వెళ్లేవారు వేలల్లో ఉంటున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనాల రద్దీ వారాంతాల్లో పదివేల వరకు ఉంటోంది. కాలుష్యం, రద్దీ, పార్కింగ్‌ వంటి సమస్యల నేపథ్యంలో వీటిని నియంత్రించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు నిత్యం 70 వేల నుంచి లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. తగిన వసతి సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనధికారిక ‘హోమ్‌స్టే’లు, ప్రైవేటు లాడ్జీలు నిలువునా దోచుకుంటున్నాయి.
తిరుమల కాంక్రీట్‌ జంగిల్‌గా మారడంతో సీఎం చంద్రబాబు సూచనల మేరకు అలిపిరిలో టౌన్‌షిప్‌ నిర్మించాలని నిర్ణయించాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. బడ్జెట్‌కు సంబంధించి అనుమతులు రాగానే నిర్మాణం మొదలవుతుంది అని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు చెప్పారు.
ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్టు టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
Read More
Next Story