సీమ పెండింగ్ ప్రాజెక్టుల కోసం మరో సమరం
x
శ్రీశైలం జలాశయం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(ఇన్సెట్)

'సీమ' పెండింగ్ ప్రాజెక్టుల కోసం మరో సమరం

రాయలసీమకు నీళ్లు, నిధుల కోసం రైతు సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. కడప దీనికి వేదిక కానున్నది.


పెండింగ్ ప్రాజెక్టుల సమస్య రాయలసీమ రైతాంగానికి శాపంగా మారింది. సరిపడ నిధుల కేటాయింపులు జరగడం లేదు. నికర జలాల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది రైతు సంఘాల ఆరోపణ. దీనికి తోడు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాలు ప్రతిబంధకంగా మారాయి. ఈ సమస్యలపై పోరాటాలకు రైతు సంఘాలు, రాయలసీమ అభివృద్ది కోసం నినదించే గొంతుకలే కాదు. ఉద్యమకారుల పిడికిళ్లు కూడా బిగుసుకుంటున్నాయి.

1990కి ముందు కడప కేంద్రంగా రాయలసీమ ప్రాజెక్టుల మహాసభకు ఆనాటి సీపీఐ నేతలు పునాది వేశారు. అందులో కడప జిల్లా నుంచి జె. వెంకట్రామిరెడ్డి (జేవీ) ఎన్. శివరామిరెడ్డి (ఎన్ఎస్), చిత్తూరు జిల్లా నుంచి రామకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా నుంచి వీకే. ఆదినారాయణరెడ్డి (వీకే), నీలం రాజశేఖరరెడ్డి, వెంగమనాయుడు, ఐదుకల్లు సదాశివన్ వంటి సీనియర్ నేతలు ఇందులో కీలకపాత్ర పోషించారు. కేవలం ఈ పోరాటం సీపీఐకే పరిమితం చేయకుండా, కడపతో సహా రాయలసీమలోని ఆనాటి కాంగ్రెస్, టీడీపీ, ఇతర సంస్థల ప్రతినిధులను కూడా మమేకం చేయడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం రైతుల చైతన్యం ద్వారా ఉధృతంగా ఆందోళనలు సాగించిన చరిత్ర ఉంది. ఆ ఉద్యమస్ఫూర్తితో..
రాయలసీమలో మరో పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. దీనికోసం మూడు అంశాల ప్రాతిపదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
1. అవశ్యకత అంతరాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం
2. ప్రభుత్వాల వైఖరి, పరిష్కార మార్గాలకోసం చర్చించడం
3. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీటి సాధన కోసం ప్రాంతీయ మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య చెప్పారు. ఈనెల (ఫిబ్రవరి) 22 నుంచి 24 వరకు కడపలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టుల కోసం ప్రాంతీయ మహాసభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభకు ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, నీటిపారుదల రంగ నిపుణులు టీ. లక్ష్మీనారాయణ, బొజ్జ దశరథరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి. ప్రసాద్ హాజరవుతారని చెబుతున్న ఆయన 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో అనేక అంశాలను పంచుకున్నారు. ఆయన ఏమంటున్నారంటే...
బచావత్ ట్రైబ్యునల్
అంతరాష్ట్ర నీటి వివాదాల చట్టం 1956 ప్రకారం ఏర్పాటయిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానీటిలో 75% నీటి లభ్యత ఆధారంగా మొత్తం 2130 టియంసిలుగా లెక్కగట్టి మహారాష్ట్రకు 585 టియంసిలు, కర్ణాటకకు 734 టియంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాజక్టుల వారిగా కేటాయించిన 811 టియంసిలలో రాష్ట్ర విభజనానంతరం తెలంగాణాకు 260.43 టీఎంసీలు, కోస్తాంధ్రకు 366.87 టీఎంసీలు, రాయలసీమకు 133.77 టీఎంసీలలో (కెసి కెనాల్ KC Cenal) కు 39.9 టీఎంసిలు, తుంగభద్ర లోలెవెల్ కెనాల్ 29.5 టీఎంసిలు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కు 32.5 టీఎంసిలు, బైరవానితిప్ప 4.9 టీఎంసిలు, గాజులదిన్నె 2.0 టీఎంసిలు, మైనర్ ఇర్రిగేషన్కు 13.9 టీఎంసిలు మొత్తం 122.7 టియంసిలు కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉంది అని ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు.
అఖిలపక్షంతో సర్దుబాటు...
కె.సి కెనాల్ ఆధునీకరణ ద్వారా 11 టీఎంసిలు, పునరుత్పత్తి ద్వారా 8 టీఎంసిలుశ్రీశైలం కుడి కాల్వ (ఎస్.ఆర్.బి.సి)కి కేటాయించింది. తుంగభద్ర నుంచి కె.సి కెనాల్కు రావాల్సిన 10 టియంసిలు పెన్నా అహోభిళం (పి.ఏ.బి.ఆర్) కు కేటాయించి అందుకు బదులుగా శ్రీశైలం నుంచి 10 టియంసిలు పోతిరెడ్డిపాడు ద్వారా చివరి ఆయకట్టుకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సర్దుబాటు చేసింది. చెన్నై తాగునీటి వాటా ఉమ్మడి రాష్ట్ర వాటాగా 5 టీఎంసీలు కేటాయించింది. నిర్మాణంలో ఉన్న గాలేరు- నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజక్టులను విస్మరించి, మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కల్పించింది.
2004లో ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా లెక్కగట్టి మూడు రాష్ట్రా మద్య పంపిణీ చేస్తూ నిర్మాణంలో ఉండి, విభజన చట్టంలో గుర్తించిన రాయలసీమ ప్రాజక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో ఆంద్రప్రదేశ్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ విచారణలో ఉండగానే బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్దంగా కర్ణాటకలో బిజెపి తిరిగి అధికారాన్ని చెరపట్టాలనే స్వార్థరాజకీయం కోసం అనుమతిలేని ఎగువ భద్ర ప్రాజక్టుకు జాతీయ హెూదా కల్పించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు యధావిధిగా అమలు చేయాలని, తెలంగాణా ఎన్నికల్లో లబ్దిపొందాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాజక్టుల వారిగా చేసిన నీటి కేటాయింపులను పున:సమీక్ష చేసేందుకు వివాదాస్పద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలు కట్టబెడుతూ రాయలసీమపై మరణ శాసనం చేసింది. అని ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
ఎత్తిపోతలతో గండి..
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఎగువన అనుమతుల్లేవని అక్రమ ఎత్తిపోతల పథకాలతో నీటిని తోడేస్తూ తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వాడుకున్న తరువాతే దిగువకు విడుదల చేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులకు వస్తే కాని రాయలసీమకు నీటిని తరలించే ముఖద్వారం పోతిరెడ్డిపాడుకు నీరందదు, శ్రీశైలం (Sresailam) కనీసనీటిట్టం 834 అడుగులకు రాకముందే విద్యుత్ అవసరాల పేరుతో అటు తెలంగాణ (Telangana), ఇటు ఏపి (AP) ప్రభుత్వాలు నీటిని తోడేసుకుపోతున్నాయి. తుంగభద్ర హెచ్ఎల్సీ (TungaBhadra HLC), ఎల్ఎల్సి (LLC), కెసి కెనాల్ (KC canal), శ్రీశైలం కుడికాలువ (SRBC) కి రావాల్సిన నికర జలాలు కూడా అందడం లేదు. మిగులు జలాల ఆధారిత ప్రాజక్టులు గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోలవరం పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణాడెల్టాను స్థిరీకరించి తద్వారా శ్రీశైలం క్యారీఓవర్ నీళ్ళను సీమ ప్రాజక్టులకు సర్దుబాటు చేసే ఆలోచనలు కూడా ఆవిరి చేస్తూ పోలవరం సామర్థ్యం తగ్గించే కుట్ర జరుగుతున్నదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు, కనీసం ఒక్కపంటకు సాగునీరు అందించి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ నీటి వివాదాలను జఠిలం చేస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు వెనకబడిన ప్రాంతాల ప్రయోజనాలను కాలరాస్తున్నది. కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. అందుకే...
రాయలసీమలో పెండింగ్ ప్రాజక్టులు, పంట కాల్వల పూర్తి చేయడానికి నిధులు కేటాయింంచాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నీటి కేటాయింపులు చేసి, వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. తద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు సాధన కోసం ఉద్యమకారులు రంగంలోకి దిగుతున్నారు.
"రానున్న కాలంలో రాయలసీమ సేద్యపు నీటి ప్రాజెక్టుల ఉద్యమానికి భవిష్యత్ కార్యాచణ సిద్ధం చేయనున్నాం" అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య చెప్పారు.


Read More
Next Story