పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదవిలో ఉండగానే ముగ్గురు నేతలు రాజ్య సభ పదవులు, పార్టీకి రాజీనామా చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలుకావడం, కూటమి ప్రభుత్వం అధికర పీఠంపై కూర్చోవడంతో సమీకరణాలు మారి పోతున్నాయి. అధికారం ఏ వైపు ఉంటే అటువైపు వెళ్లే నేతలు పెరిగారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ నుంచి కూటమి పార్టీల్లోకి వెళ్లేందుకు నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల బీదా మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణలు తమ రాజ్య ఎంపీ పదవులకు, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. తాజాగా మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.
అవంతి శ్రీనివాస్ అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అయితే ఆయన అవంతి శ్రీనివాసరావుగా ఫేమస్ అయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగారు. అంతకు ముందు టీడీపీలో ఎంపీగా ఉన్నారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. తర్వాత ఎన్నికల సమయానికి ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలోకి మారారు. ఎంపీ స్థానం నుంచి కాకుండా ఎమ్మెల్యేగా రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దిగిన అవంతి శ్రీనివాస్ ఆ ఎన్నికల్లో గెలుపొంది.. ఏకంగా మంత్రి పదవిని కూడా చేజిక్కించుకున్నారు. ఆ ఐదేళ్ల పాటు ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భీమిలి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీ నుంచి బరిలోకి దిగిన గంట శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ కేవలం 11 సీట్లకు పరమితమై అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెలువడి నాటి నుంచి అవంతి శ్రీనివాస్ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత ఐదు నెలలుగా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న అవంతి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కంటే తన పొలిటికల్ కెరీర్ ముఖ్యమనుకున్నారో ఏమో కానీ పార్టీని వీడారనే టాక్ వినిపిస్తోంది.
Next Story