ఏపీ లిక్కర్ స్కాంలో మరో కుదుపు, అనిల్ చోఖ్రా అరెస్ట్
x
Anil Chokhra, Mumbai

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కుదుపు, అనిల్ చోఖ్రా అరెస్ట్

ఎవరీ అనిల్ చోఖ్రా? లిక్కర్ స్కాంలో ఆయన పాత్రేంటీ?


వైఎస్ జగన్ హయాంలో జరిగినట్టు చెబుతున్న మద్యం కుంభకోణం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈకేసులో 49వ నిందితునిగా ఉన్న ముంబయి వ్యాపారి అనిల్‌ చోఖ్రా ను సిట్‌ అధికారులు ఇవాళ విజయవాడ తీసుకువస్తున్నారు. శనివారం ఇక్కడి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలకు ఈయన బ్రోకర్ గా పని చేసినట్టు తెలుస్తోంది. ముడుపుల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్‌ కోసం అనిల్‌ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక అధికారుల బృందం (సిట్) తేల్చింది.
ఎవరీ అనిల్ చోఖ్రా...
అనిల్ చోఖ్రా ముంబాయి వాసి. డబ్బులు చేతులు మార్చడంలో దిట్ట. అనిల్‌ చోఖ్రా నియంత్రణలో మొత్తం 35 డొల్ల కంపెనీలు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. నకిలీ పేర్లు, డమ్మీ డైరెక్టర్లతో వీటన్నింటినీ ఆయనే ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు. తప్పుడు పత్రాలు తయారు చేసి, మోసపూరిత బులియన్‌ ట్రేడ్‌ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అతనిపై అనేక కేసులున్నాయి.
గతంలో ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండు సార్లు అరెస్టు చేసింది. హవాలా ఏజెంట్లు, నిధుల రూటింగ్, లేయరింగ్‌లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ మొత్తంలో ఎక్కువ భాగం విదేశాల్లోని ఖాతాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.
కమీషన్ల రూపంలో తీసుకున్న నల్లధనాన్ని ‘వైట్‌’ చేసేందుకు వాడిన మనీ లాండరింగ్‌ మూలాలు అనిల్ చోఖ్రా వద్ద ఉన్నాయని సిట్‌ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రెండు రోజుల క్రితం విజయవాడ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడ అనిల్‌ చోఖ్రాను ప్రశ్నించాయి. అనిల్‌మనీలాండరింగ్‌ కేసుల్లో ఇప్పటికే రెండుసార్లు అరెస్టయ్యారు. డొల్ల కంపెనీలు సృష్టించి నల్ల డబ్బును తెలుపు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. బినామీల పేరుతో క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ట్రిఫర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, విక్సో ఎంటర్‌ప్రైజెస్‌ అంటూ నాలుగు డొల్ల కంపెనీలు సృష్టించారు.

ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారు. వీటి ద్వారా ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు వేర్వేరు కేసుల్లో 2017లో, 2021లో అరెస్టు చేసి జైలుకు పంపింది. బెయిలుపై బయటికి వచ్చిన అనిల్‌ చోఖ్రాను గత ప్రభుత్వ హయాంలో కొందరు సంప్రదించారు.
కేసు దర్యాప్తులో భాగంగా ‘సిట్‌’ అధికారులు అనిల్‌ చోఖ్రా కార్యకలాపాలు, మద్యం ముడుపులను మార్చడంలో ఆయన పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఎవరెవరితో, ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపారనే సాంకేతిక ఆధారాలను గుర్తించారు.
అనిల్‌ చోఖ్రాను 49వ నిందితుడిగా చేరుస్తూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇప్పటికే 48మంది నిందితులున్న ఈ కేసులో 12మందికి పైగా అరెస్టయ్యారు. కొందరు బెయిలుపై విడుదల కాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనిల్ చోఖ్రా అరెస్ట్ జరిగింది.
Read More
Next Story