పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ షాక్ తగిలిన దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని అంటున్నారు. పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగలకు తాకడంతో కరెంట్ షాక్‌కు గురయ్యారు. బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణలు ఈ దుర్ఘటనలో మరణించారు. మృత దేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుపాలైన కోమటి అనంతరావును తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి తాడిపర్రులో గత కొన్ని రోజులుగా వివాదం ఉంది. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల పిలిపించిన కొవ్వూరు సబ్‌కలెక్టర్ రాణి సుస్మిత రెండు వర్గాలతో చర్చించారు.వివాదాలు ఉండకూడదని ఇరువర్గాలకు సర్థి చెప్పి రాజీ కుదిర్చారు. గొడవలు పెట్టుకోకూడదని శాంతింప చేసిన సబ్‌కలెక్టర్ విగ్రహ ఆవిష్కరణకు అనుమతులిచ్చారు. అయితే ఈ విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతులు మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం దీనిని ఆవిష్కరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో జనం నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేశ్, మృతుల కుటుంబాలను పరామర్శించారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.