రఘురామ కేసులో మరో ట్విస్ట్, విచారణకు రాలేనన్న తులసిబాబు ఎవరు?
x

రఘురామ కేసులో మరో ట్విస్ట్, విచారణకు రాలేనన్న తులసిబాబు ఎవరు?

మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది


మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జనవరి 3 శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్న మరో నిందితుడు కామేపల్లి తులసి బాబు -.. తాను విచారణకు రాలేనని, తనకు మరికొంత కావాలని కోరారు. 2025 జనవరి 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
ఈకేసులో నిందితునిగా ఉన్న కామేపల్లి తులసిబాబు (Kamepalli Tulasibabu)ను జనవరి 3న ఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాలని ఒంగోలు ఎస్పీ నోటీసులు ఇచ్చారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న రఘురామ గుండెలపై తులసిబాబు కూర్చొని టార్చర్ చేశాడనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను విచారించాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. తులసిబాబును గుర్తించేందుకు విచారణకు హాజరౌతానని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు. దీంతో జనవరి 3 మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ దామోదర్- తులసిబాబుకు నోటీసులు జారీ చేశారు.
రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు..
కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌కు లేఖ రాశారు. 2021 మే 14 రాత్రి సీఐడీ అధికారులు కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన సమయంలో 115 కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి తన ఛాతీపైన కూర్చొన్నాడని, ఆ వ్యక్తి తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ తెలిపారు. ఈనెల 3న తులసిబాబును తన కేసులో విచారణకు పిలిచారని పత్రికలలో చూశానని, ఆవ్యక్తిని గుర్తించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని రఘురామ కృష్ణం రాజు కోరారు.
ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్ కు కుడిభుజంగా వ్యవహరించే వారని సమాచారం. ప్రస్తుతం గుడివాడ టౌన్‌లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో కార్యకలాపాలు చూస్తున్నాడని తెలిపారు. తులసిబాబును విచారణకు పిలిచిన రోజు తనకూ అనుమతి ఇస్తే గుర్తుపట్టగలనని ఆ లేఖలో పేర్కొన్నారు.
డాక్టర్‌ ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరణ...
రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.
బాధితుడైన రఘురామ తన న్యాయవాదులు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్‌ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరారు.
మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.
Read More
Next Story