టెన్త్ లో 600 కి 599 మార్కులు సాధించిన ఈ అమ్మాయి ఎవరంటే!
x

టెన్త్ లో 600 కి 599 మార్కులు సాధించిన ఈ అమ్మాయి ఎవరంటే!

ఆంధ్ర పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన మనస్వి. 600కి 599 మార్కులు సాధించింది. తన విజయ రహస్యం ఏంటంటే..


ఆంధ్ర పదో తరగతి ఫలితాల్లో యావత్ రాష్ట్రాన్ని ఔరా అనిపించింది ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఆకుల వెంకటసాయి మనస్వి. పరీక్షల్లో 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. ఒక్క సెకండ్ లాంగ్వేజ్‌లోనే 99 మార్కులు వచ్చాయి. దీంతో ఈ రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఈ అమ్మాయి గురించే చర్చ. ఈ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వడానికి పెద్ద పెద్ద విద్యాసంస్థలు కూడా క్యూలు కడుతున్నాయి. ఇంతకీ ఎవరీ మనస్వీ, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకుందామా..

మనస్వి తల్లీదండ్రి ఇద్దరూ ప్రభుత్వ ఉపాద్యాయులే. తమ కూతురు చదువునే లక్ష్యంగా పెట్టుకోవడంతో వారు తమ పూర్తి సహకారం అందించారు. వీరు ఉపాద్యాయులే అయినా కొందరు తల్లిదండ్రుల్లా పొద్దస్తమానం చదువు..చదువు అంటూ మనస్వి వెంటపడలేదు. చదువుపై ఏకాగ్రత, ఇష్టం కలగడానికి వీలైన వాతవరణాన్ని వాళ్లు ఇంట్లో క్రియేట్ చేశారు. అనేక మంది పిల్లలకు పాఠాలు చెప్పిన అనుభవాన్నంతటిని రంగరించి తమ కూతురు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సోపానాలను సిద్ధం చేశారు. మనస్వికి కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు కూడా చదవడం అలవాటు చేశారు. పాఠ్యపుస్తకాల్లో నేర్పించే అంశాలకు మరిన్ని కొత్త విషయాలను నేర్పించేటటువంటి పుస్తకాలను కూడా మనస్వికి ఇచ్చారు. ఇలా ఇష్టంతో చదవడమే మనస్వి విజయ రహస్యమని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. అదే విధంగా తన తల్లిదండ్రికి ఇచ్చే గిఫ్ట్ అని మనస్వి వెల్లడించింది.

నాన్నే నాకు స్ఫూర్తి

‘‘మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్.. నా రోల్ మోడల్. క్రికెట్ అంటే పిచ్చి. మ్యాచ్ వస్తుంటే చూస్తూ ఉండిపోతా. విరాట్ కోహ్లీ నా ఫేవరేట్. ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి నాన్న. ఆయన నా బెస్ట్ హీరో. ఆయన తర్వాతే ఎవరైనా. 25ఏళ్ల కిందట ఆయన డీఎస్‌సీ రాశారు. కానీ ఉద్యోగం రాలేదు. గతేడాది ప్రభుత్వం చేసిన రిక్రూట్‌మెంట్‌లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఏనాడూ నిరాశ పడలేదు నాన్న. నాకు అన్ని విషయాల్లో ఆయనే స్ఫూర్తి’’ అని మనస్వి వివరించింది.

టాపర్ కావడం నా కల కాదు

టాపర్ కావాలని తాను ఏనాడు కోరుకోలేదని మనస్వి చెప్పింది. అదే సమయంలో తన విజయ రహస్యాన్ని కూడా బహిర్గతం చేసింది. ‘‘పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి నేను గైడ్‌లు, క్వశ్చన్ బ్యాంక్‌లు, నోట్స్ చదవను. టెక్స్ట్ బుక్స్‌నే ఎక్కువగా ఫాలో అయ్యేదాన్ని. వాటినే రివిజన్ చేసేదాన్ని. టాపర్ కావాలని అస్సలు అనుకోలేదు. నా లక్ష్యం టాపర్ కావాలని కాదు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని. దానికి తగ్గట్టుగానే చదువును కొనసాగించా. పరీక్షలు రాశానే తప్ప 599 మార్కులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. నా మార్కులు చూసి నేను నమ్మలేకపోయాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఐటీలో ఇంజినీరింగ్ చేసి మంచి జాబ్ చేయాలన్నదే నా కోరిక’’అని వెల్లడించింది మనస్వి.

Read More
Next Story