ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు.. అసెంబ్లీలో ఆమోదం
x

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు.. అసెంబ్లీలో ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు పలు కీలక బిల్లులపై వాడివేడిగా చర్చలు జరిగాయి. వాటిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధానంగా మారింది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు పలు కీలక బిల్లులపై వాడివేడిగా చర్చలు జరిగాయి. వాటిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధానంగా మారింది. ఈ చట్టం అమలు జరిగినప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వస్తూనే ఉంది. అదే క్రమంలో ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. చెప్పినట్లే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన తొలి ఐదు సంతకాల్ల ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కూడా ఉంది. తాజాగా ఈ చట్టం రద్దు అంశంపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఈ చట్టం వల్లే మేలు కన్నా కీడే ఎక్కువ జరిగేలా ఉందని కూటమి నేతలు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగిని సత్యప్రసాద్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ఈ చట్టం లేని సమస్యలను సృష్టించేలా ఉందంటూ చర్చను ప్రారంభించారు.

ఈ చట్టం ఉద్దేశం అదేనా!

‘‘ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్లే రాష్ట్రంలోని భూ వివాదాల సంఖ్య గణనీయంగా పెరిగేలా ఉంది. ఈ చట్టం ఉన్న భూ సమస్యలను పరిష్కరించేలా కాకుండా లేని సమస్యలను పుట్టించేలా ఉంది. యజమానులకు తమ భూములపై వారికే హక్కు లేకుండా చేయడమే ఈ చట్టం ఉద్దేశంగా కనబడుతోంది. ఈ చట్టం కారణంగా మరిన్ని భూవివాదాలు వచ్చేలా ఉన్నాయి. పేదల రైతులకు ఇబ్బంది వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా? చిన్నపాటి వివాదాలు తలెత్తితే వాటి కోసం లాయర్లకు ఫీజులు ఎక్క ధారపోస్తారు’’ అని అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆతర్వాత ఈ చట్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఇదో భయంకరమైన చట్టం: సీఎం

‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేదో భయంకరమైన చట్టం. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల అనేక భూ సమస్యలు తలెత్తాయి. పరజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేది. ఈ చట్టం కలిగే లాభం శూన్యం. ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టడానికే ఈ చట్టాన్ని తెచ్చారు’’ అని మండిపడ్డారు చంద్రబాబు. తమ భూ కబ్జాలకు ఎటువంటి అడ్డూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకురావడానికి గత ప్రభుత్వం యత్నించిందని విమర్శించారు.

బిల్లు రద్దుకు ఆమోదం

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై పూర్తిగా చర్చలు జరిగిన తర్వాత ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దీంతో పాటుగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్‌టీఆర్ పునరుద్దరణకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులపై సభలో సభ్యులు మాట్లాడిన అనంతరం బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

Read More
Next Story