ఈ సారైనా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని అంతా భావించారు. పలు అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టుబడుతుందని అనుకున్నారు. కానీ..


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు నిర్వహించాలని అధికార పక్షమైన కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బీఏసీలో నిర్ణయించిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. సోమవారం జరగనున్న బీఏసీ సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు వంటి పరిస్థితులపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు మాజీ సీఎం జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అంతా భావించారు. అయితే ఈ సమావేశాలకు తాము హాజరు కావడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం, పులివెందు ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇది వరకే హింటిచ్చారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లడం లేదో తెలిపారు. సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వరని, సమయం కేటాయించరని, ప్రజల సమస్యలపై గొంతెత్తడం అధికార పక్షమైన కూటమి ప్రభుత్వం అంగీకరించదని విమర్శలు చేశారు. 40 శాతానికిపైగా ఓట్‌ షేర్‌ సాధించిన వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూడా సమస్యగా మారిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకెళ్లడం వల్ల ఉపయోగం ఏంటని జగన్‌ ప్రశ్నించారు. అందువల్ల సమావేశాలు జరిగే సమయంలో మీడియా ముందుకు వస్తామని, మీడియా ముందే ప్రజల సమస్యలపై గొంతెత్తుతామని స్పష్టం చేశారు. అందువల్ల మీడియా, మీడియా ప్రతినిధులే తమకు స్పీకర్లని పేర్కొన్నారు. దీంతో జగన్‌ కానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదనే విషయం చెప్పకనే చెప్పారు.
మరో వైపు జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లక పోవడాన్ని జగన్‌ సోదరి, పీసీసీ చీఫ్‌ షర్మిల తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడక పోతే ఇక వారికి ఆ పదవులెందుకని నిలదీశారు.
ఈ నేపథ్యంలో అధికార పక్షమైన కూటమి సభ్యులే సమావేశాలకు హాజరు కానున్నారు. గతంలో జరిగిన విధంగానే ఈ సారి కూడా ఆత్మ స్తుతి పరనింద మాదిరిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గత ప్రభుత్వ పాలననే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పలు అంశాలకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు.
Next Story