హోరెత్తుతున్న ఏపీ అసెంబ్లీ:  గంటా రాజీనామా ఆమోదంపై రభస
x
AP Assembly

హోరెత్తుతున్న ఏపీ అసెంబ్లీ: గంటా రాజీనామా ఆమోదంపై రభస

ఏపీ అసెంబ్లీ పోటాపోటీ నినాదాలు, అరుపులు, కేకలతో హోరెత్తుతోంది. స్పీకర్ పోడియం ను చుట్టుముట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, బయటకు పంపించాలని వైసీపీ ఎమ్మెల్యేలు..


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరస్పర నినాదాలు, నిరసనలతో హోరెత్తుతోంది. నిన్న మొదలైన బడ్జెట్ సమావేశాలు అరగంటలోనే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. నిత్యావసర వస్తువుల ధరలపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టబట్టగా తీర్మానాన్ని తిరస్కరించినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించడంతో సభలో రభస జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని, చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పప్పులు, ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

హోరెత్తిన నినాదాలు...


రెండో రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తేలిపే తీర్మానంపై ప్రసంగం మొదలైంది. వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టచ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు స్పీకర్ చైర్ వద్ద బల్లలు చరిచి తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి మరి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీ బ్రేక్ ఇస్తూ సభను వాయిదా వేశారు.

అసెంబ్లీని తాకిన సర్పంచుల నిరసన...

సర్పంచ్‌ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్‌ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు దూసుకొచ్చారు. కొందరు సర్పంచ్‌లను వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు రాగలిగినట్లు తెలుస్తోంది. మరికొందరు సర్పంచ్‌ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు.

కదం తొక్కిన సర్పంచులు...


తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌ల నినాదాలు చేశారు. నిరసనకు వచ్చిన సర్పంచ్‌లను పోలీసులు నిర్దాక్షణ్యంగా ఈడ్చిపాడేశారు. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు.

గంటా రాజీనామా ఆమోదం...

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. ముందుగా నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ వెల్లడించారు. తర్వాత సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Read More
Next Story