షర్మిల వచ్చేసింది, మొదటి సారి మహిళ నేతృత్వంలో కాంగ్రెస్

1953 నుంచి ఇప్పటిదాకా ఆంధ్రా కాంగ్రెస్ కు మహిళలెవ్వరూ నాయకత్వం వహించలేదు. ఇపుడు ఇపుడు షర్మిల రాకతో నూతన శకం ప్రారంభమవుతుందా?


షర్మిల వచ్చేసింది,  మొదటి సారి మహిళ నేతృత్వంలో కాంగ్రెస్
x
మణిపూర్ లో జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసిన తరువాత షర్మిల, గిడుగు రుద్రరాజు, జెడి శీలం, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత నామ రూపాలు లేకుండా పోయింది.1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో అధికార పక్షమో, ప్రతిపక్షంగానో ఉంటూ వచ్చిన పార్టీ 2014 నాటికి అసెంబ్లీలో మాయమయింది. ఒక్క సీటు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇలాంటపుడు ఒక మహిళ చేతికి కాంగ్రెస్ నాయకత్వం వచ్చింది. అంతేకాదు, గత అరవై యేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎపుడు ఒక మహిళ అధ్యక్షురాలు కాలేుదు. షర్మిలయే తొలిసారి మహిళా అధ్యక్షురాలు అయ్యారు.


14 ఏళ్ల తరువాత వైఎస్ కుటుంబం నుంచి కాంగ్రెస్ లోకి షర్మిల


ఒకప్పుడు కాంగ్రెస్ కు వైఎస్ఆర్ మాత్రమే దిక్కు. ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తెచ్చారు. ప్రజల మన్ననలు పొందారు. కాంగ్రెస్ కూడా ఆయన ఏమి చెబితే అది చేస్తూ వచ్చింది. పీసీసీ అధ్యక్షులుగా వైఎస్ సక్సెస్ అయ్యారు. పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకు పోవడంలో విజయం సాధించారు. తిరిగి ఇప్పుడు పతనావవస్థలో ఉన్న కాంగ్రెస్ ను గట్టించేందుకు వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిల రంగంలోకి వచ్చారు.

త్వరలో బాధ్యతలు

వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు ఆమె సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని మణిపూర్ లో సోమవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులు కలిసారు. అప్పటికే గిడుగు రుద్రరాజు సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈరోజు పిసిసి అధ్యక్సురాలిగా ఆమెను నియమించారు. ఆలస్యం కాకుండా వెంటనే పీసీసీ బాధ్యతలు చేపట్టాలని ఏఐసీసీ అధిష్టానం కోరినట్లు సమాచారం.




కాంగ్రెస్ పుంజుకుంటుందా?

షర్మిల రాకతో కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుంది. షర్మిలలో వైఎస్సార్ ను జనం చూస్తారని తప్పకుండా జనం ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే చాలా మంది షర్మిలను అనుసరించాలని భావిస్తున్నారు. ఇద్దరు వైసిసి ఎమ్మెల్యేలు ఇప్పటికే సంకేతాలు పంపారు. వైఎస్సార్సీపీలో ఉన్న అసంతృప్తి వాదులంతా ఏకమై కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిని ‘మర్యాదపూర్వకం’గా కలిశారు. ఇంకా చాలా మంది అసంతృప్తి వాదులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం

ఇప్పటికే వైఎస్ఆర్ కాంగెస్ నుంచి వస్తున్నా టీడీపీ నుంచి ఎవ్వరూ రాలేదు. అయితే, రెండుపార్టీలలో అసమ్మతి వాదులు పేరుకుపోతున్నారు. టిడిపిలో కూడా లుకలుకలు కనబడుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు టీడీపీ కూడా టిక్కెట్లు ప్రకటించిన తరువాత తప్పకుండా వలసలు వుండే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అదే జరిగితే రెండు ప్రధాన పార్టీలపై కాంగ్రెస్ ప్రభావం వుంటుదని చెప్పవచ్చు.

అన్నా చెల్లెలు మధ్య మాటల యుద్దం జరిగే అవకాశం

షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలపై యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మాటల యుద్దం జరుగుతుంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివద్దిపై స్పందించాల్సి ఉంటుంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చే హామీలు ఓటర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ కు జవసత్వాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక అన్నా చెల్లెళ్ల మధ్య పోరు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ననుంచి దూరంగా ఉంటున్న షర్మిల ఇకపై నేరుగా విజయవాడ కేంద్రంగానే పోరాడాల్సి ఉంటుంది.

నా బాధ్యత ముగిసింది

నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాను. షర్మిల ఎప్పుడు బాధ్యతలు నిర్వహిస్తారో నాకు తెలియదు. కమిటీని కూడా మారుస్తారా? పాత కమిటీనే వుంచి అధ్యక్షుడి పోస్టు మాత్రమే మారుస్తారా అనేది తెలియదు. త్వరలోనే మార్పులు చూస్తారు. కాంగ్రెస్ కు మంచి కాలం ముందుంది.

-గిడుగు రుద్రరాజు, పీసీసీ మాజీ అధ్యక్షులు.

Next Story