ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి 800 ఎకరాలు కాజేశారంటున్న జనసేన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల భూమిని ఆయన కాజేసినట్టు జనసేన ఆరోపించడం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చుట్టూ వివాదం రాజుకుంది. పరస్పర ఆరోపణలు, సవాళ్ల మధ్య సీఎస్ జవహర్ రెడ్డి సతమతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల భూమిని జవహర్ రెడ్డి తన పదవిని అడ్డంపెట్టుకుని సంపాయించాడని జనసేన విశాఖపట్నం నాయకుడు, కార్పొరేటర్ ఆరోపిస్తుంటే ఆ విషయాన్ని రుజువు చేయకపోతే పరువు నష్టం దావా వేస్తానని సీఎస్ ఖండిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో జవహర్ రెడ్డి రెండుమూడు సార్లు విశాఖపట్నం వెళ్లిరావడమే ఇందుకు కారణంగా ఆయనంటే గిట్టని వారు చెబుతున్నారు. తాజాగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మే 26న (ఆదివారం) విశాఖపట్నంలో మీడియా సమావేశం పెట్టి జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్రలో బినామీల పేరిట 800 ఎకరాల భూమిని కాజేశారని ఆరోపించారు. దీనిపై జవహర్ రెడ్డి ఇంకా ఎటువంటి కామెంట్ చేయనప్పటికీ ఇప్పుడీ వివాదం చినికి చినికి గాలివాన అయినట్టుంది.
మూర్తి యాదవ్ ఏమన్నారంటే...
'పేద రైతుల ఎసైన్డ్ భూములను లాక్కున్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధం. సింహాచల చందనోత్సవం సమయానికి ముందు జవహర్‌రెడ్డి స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వెళ్లడంలో తప్పులేదు.. కానీ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలుసు. స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లామంటున్నారు. ఆయన ఇల్లు ఎటువైపు ఉంది? సీఎస్ ఎటు వెళ్లారు?ఎన్నికల వేళ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే భోగాపురం మీదే ప్రేమ ఎందుకు? కుమారుడిని ముందే పంపి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందే ఇచ్చారు" అని మూర్తి యాదవ్ ఆరోపించారు.
"భోగాపురం సమీపంలోని కంచేరులో అనుమతులు మంజూరు చేస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్ నాగలక్ష్మి ప్రొసీడింగ్స్ ఇచ్చారు" అని మూర్తి యాదవ్ ఆరోపించారు. జవహర్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు పొందారో కూడా మూర్తి యాదవ్ వివరించారు.
"పూసపాటిరేగ మండలం ఎరుకొండ, చిన్నబత్తిలివలస, కోవాడ, పొన్నాడ గ్రామాలతో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి మండలం పద్మనాభం, ఐనాడ, బుద్దివలస, కొరడామద్ది, నరసాపురం, పాండ్రంగి, తిమ్మాపురం గ్రామాల్లో ఫ్రీ హౌల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. 'నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్ రెడ్డి చేసిన న్యాయం ఇదేనా?' వైసిపి నాయకులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఫ్రీ హౌల్డ్ సర్టిఫికెట్లు తీసుకుని దోచేశారు" అని ధ్వజమెత్తారు. "సీఎస్ జవహర్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. జీవో నంబర్ 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేయాలి. సీఎం జగన్ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలన్నీ వేగంగా జరిగేలా చేశారు. ఆ భూములు రైతుల చేతుల్లో లేవు. త్వరలో దీని వెనుక ఉన్న తహసీల్దార్ల పేర్లు బయటపెడతాను. మళ్లీ వైసిపి ప్రభుత్వం రాదని తెలిసే రహస్యంగా ఈ లావాదేవీలు జరిపారు” అంటున్నారు పీతల మూర్తి యాదవ్. ఇదే అదునుగా టీడీపీ కూడా సీఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
జవహర్ రెడ్డి ఏమన్నారంటే...
అయితే, ఈ ఆరోపణలను జవహర్‌రెడ్డి కొట్టిపడేశారు. విశాఖ పరిసరాల్లో తాను, కుటుంబ సభ్యులు ఎవరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేయలేదన్నారు. పీతల మూర్తి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని.. తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లానన్నారు. అదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని పరిశీలించానని.. అసైన్డ్ భూముల కోసమే విశాఖ వచ్చాననడం అర్థరహితమన్నారు. తన కొడుకు గత ఐదేళ్లలో విశాఖ, ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాకు వెళ్లలేదని.. తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తి మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీప్ సెక్రటరీ. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారు? అన్నారు సోమిరెడ్డి. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఒక సీఎస్‌గా ఎలా అంగీకరిస్తారు? ఎవరూ అడగని రీసర్వేను రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారు? తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల్లో వైఎస్‌ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారు. ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల పత్రాలపై రోజూ జగన్ ఫొటోలు చూసుకోవాలా? రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్‌గా అదుపు చేయడంలో విఫలమై కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ఫైల్‌పై అంత తొందరెందుకు?’’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు.