చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవులు ఎంత మందికి ఇస్తారు? ఎవరికి కేటాయిస్తారు?


ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవి హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత మందికి ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇస్తారు అనేది టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూటమి శ్రేణుల్లో ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంతో ఈ సారి కూడా ఇద్దరి నేతలకు డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వొచ్చనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఎంత మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. తెలంగాణలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇద్దరికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇద్దరి నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కల్పించారు. ఏ సామాజిక వర్గాలకు ఈ పదవులు ఇవ్వాలనే అంశం కూడా తెరపైకి వచ్చింది. నాడు కాపు అంశం తీవ్రంగా ఉన్న సందర్భంలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కాపు సామాజిక వర్గానికి, టీడీపీకి బీసీలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న నేపథ్యంలో మరొక ఉప ముఖ్యమంత్రి పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులతో పాటు చినరాజప్పకు హోమ్‌ శాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవిన్యూ శాఖలను కూడా కేటాయించారు.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రుల సంఖ్య భారీగా పెంచేశారు. అప్పటి వరకు రెండుగా ఉన్న సంఖ్యను ఏకంగా ఐదుకు పెంచేశారు. ఐదుగురు నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల వారీగా కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాముల పుష్పశ్రీవాణికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కే నారాయణస్వామికి, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నానికి, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్‌ బాషకు, ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎంలుగా పదవులు కల్పించారు. తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎస్టీ నుంచి రాజన్నదొర, కాపు నుంచి బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వగా ఇది వరకు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న కే నారాయణస్వామి, అంజాద్‌ బాషలకు అవే పదవులను కొనసాగించారు.
తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే టాక్‌ నడుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ ఒక్కరికే డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా 2014లో మాదిరిగా ఇద్దరికి అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తి కరంగా మారింది.
Next Story