భావోద్వేగాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విమరణ.


ఇకపై పోలీసు యూనిఫామ్‌ వేసుకునే అవకాశం ఉండదని ఊహించడం కష్టంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ద్వారకా తిరుమలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విమరమణ వీడ్కోలు పరేడ్‌ను శుక్రవారం మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీరరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఐపీఎస్‌ అధికారులందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ భావోద్వాగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలుగా ఆయన పేర్కొన్నారు. తన పోలీసు డ్రెస్‌ గురించి, దానికి ఆయనకు ఉన్న అనుంబంధం గురించి చెబుతూ.. ఎమోషన్‌కు గురయ్యారు. తన 35 ఏళ్ల ఐపీఎస్‌ ప్రయాణం నేటితో ముగుస్తుందన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు తన మైండ్‌లో మెదులుతున్నాయన్నారు. దశాబ్దాలుగా తన శరీరాన్ని అంటుకొని ఉన్న పోలీసు యూనిఫామ్‌ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన ఎమోషన్‌ అన్నారు. ఇది బాధ అని అనను.. అలా అని సంతోషమూ అని అనను.. కానీ ఇదొక ప్రత్యేకమైన ఎమోషన్‌ అని అన్నారు. ఖచ్చింతగా తన 35ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్‌ ప్రయాణం సంతృప్తికరంగానే ముగిసిందన్నారు.

ఈ సందర్భంగా కొందరి అధికారులను గుర్తు చేసుకున్నారు. వారిలో తమ ముస్సోరి అకాడమీ డైరెక్టర్, సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్‌ ఐఏఎస్‌ను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. తన ట్రైనర్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరిని ఎప్పటికీ మరిచి పోలేనని అన్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, మహంకాళమ్మలను గుర్తు చేసుకున్నారు. తనకు విద్యా బుద్దులు నేర్పిన తన ఉపాధ్యాయులను స్మరించుకున్నారు. తన భార్య డాక్టర్‌ పావని గురించి ప్రత్యేకంగా స్మరించుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను సర్వీసులో చేరిన నాటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొని విధులు నిర్వర్తించానని తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్‌ నుంచి సాంకేతిక పోలీసింగ్‌ వైపు పోలీసు రంగం మారిందన్నారు. ప్రభుత్వాల సహకారంతోనే తన హయాంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానన్నారు. తనకు సహకరించిన ప్రతి పోలీసు అధికారి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని, ప్రత్యేక ముద్ర వేశారని, ప్రజల కోసం, ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర డీపీజీగా తన శక్తి మేర కృషి చేస్తానని, సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.
Next Story