ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలపై డీజీపీ ఫోకస్
x

ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలపై డీజీపీ ఫోకస్

ఆంధ్రలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పాత కక్షలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. వీటిపై డీజీపీ హరీష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.


పోలింగ్ రోజు నుంచి నేటికి కూడా ఆంధ్రలో హింస కట్టలు తెంచుకుని పరవళ్లు తొక్కుతోంది. ఎక్కడ చూసినా హింసే కనిపిస్తోంది. రాడ్లు, రాళ్లు, కత్తులు తీసుకుని ఇరు వర్గాలు దాడులకు పాల్పడుతున్నాయి. పార్టీ అభ్యర్థులపై కూడా దాడులు జరిగిన ఘటనలు చాలానే నమోదు అయ్యాయి. రాష్ట్రంలో హింస ఇంతలా పెరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తోంది. అయితే పలు నియోజకవర్గాల్లో హింసను నియంత్రించడానికి పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. 144 సెక్షన్స్‌ను అమలు చేయడం, కీలక నేతలను హౌస్‌ అరెస్ట్ చేసి వారికి భద్రత కల్పించడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న హింసపై డీజీపీ హరీష్ కుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది? వాటిని నివారించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వంటి అంశాలను పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. అదే విధంగా వాటి విషయంలో ఏ విధంగా మసులుకోవాలి అన్న విషయంపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే దాడులకు కారణం అవుతున్న ప్రధాన నేతను హౌస్ అరెస్ట్ చేయాలని, పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిబంధనలను అనుసరించాలని పోలీసులకు డీజీపీ ఆదేశించినట్లు సమాచారం.

అందులో భాగంగానే అరెస్ట్‌లు చేయడానికి ఏమాత్రం వెనకాడొద్దని కూడా ఆయన ఆదేశించారు. దాడులకు పాల్పడిన నేపథ్యంలో సదరు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారు ఎవరైనా ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ఆయన వివరించారు. దాడులను నివారించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలను అసౌకర్యం, అశాంతి కలిగించే ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

Read More
Next Story