చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీపై దృష్టి సారించింది. సమర్థత కలిగిన అధికారులను మంచి పోస్టుల్లో నియమించే దిశగా అడుగులు వేస్తోంది.


ఇటీవల భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా రాష్ట్ర పోలీస్‌ బాస్‌ను కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత డీజీపీ హరీకుమార్‌ గుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సిహెచ్‌ ద్వారకా తిరుమలరావును సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో ద్వారకా తిరుమలరావు ఒకరు. రాష్ట్రంలో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లోకి ఈయన అగ్ర స్థానంలో ఉన్నారు. మంచి అధికారిగాను, నిజాయితీ కలిగిన అధికారిగాను, నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో ఈయనకు పేరు ఉంది. ప్రస్తుతం ఆయన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌గా, ఏపీఎస్‌ఆర్టీసి ఎక్స్‌ అఫిషియో వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్కడ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ ( కో–ఆర్డినేషన్‌) పోస్టులో నియమించింది. దీంతో పాటుగా డీజీపీ పోలీస్‌ ఫోర్స్‌ హెడ్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ కమిషనర్, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎక్స్‌ అఫిషియో వైస్‌ చైర్మన్, ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. ఈయన 1989వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. డీజీ రైల్వేస్‌గాను, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గాను పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
సిహెచ్‌ ద్వారకాతిరుమలరావు వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన అధికారి. బీసీ వర్గాల్లో బోయ సామాజికి వర్గానికి చెందిన వారు. ఈయన గుంటూరు జిల్లా వాస్తవ్యులు. ఈయన తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ విభాగంలో అధికారిగా పని చేశారు. ద్వారకా తిరుమలరావు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌) పూర్వపు విద్యార్థి. ఇక్కడ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదవారు. 1985–87లో మ్యాథ్‌మ్యాటిక్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(ఎంఎస్సీ) చేశారు. తర్వాత 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తన సర్వీసు తొలినాళ్లల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు ఏఎస్పీగా పని చేశారు. తర్వాత కామారెడ్డి ఏఎస్పీగాను, ధర్మవరం ఏఎస్పీగాను, నిజామాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గాను, విజయవాడ రైల్సేస్‌ ఎస్పీగాను పని చేశారు. అనంతరం 1995లో పదోన్నతి పొందిన తర్వాత అనంతపురం జిల్లాతో పాటు కడప, మెదక్‌ జిల్లాల ఎస్పీగాను, సీఐడీ, సీబీఐ వంటి పలు విభాగాల్లో ఎస్పీగాను పని చేశారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీగాను విధులు నిర్వహించారు. ఎస్‌ఐబీలోను డీఐజీగా పని చేశారు. ఐజీగా పదోన్నతి పోందిన తర్వాత అక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో ఐజీ హోదాలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా పని చేసిన ద్వారకా తిరుమలరావు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా కూడా పని చేశారు. 2021 జూన్‌ నుంచి ఆర్‌టీసీ ఎండీగా ఉన్నారు.
ద్వారకా తిరుమల రావు 2024 ఎన్నికల సమయంలోనే డీజీపీ అవుతారని అందరూ భావించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా మొదటి స్థానంలో ఉండటం, ఎన్నికల కమిషన్‌కు పంపిన జాబితాలో ఈయన పేరు ఉండటంతో ద్వారకా తిరుమలరావే డీజీపీ అవుతారని భావించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారు. అప్పటి వరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి నాటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నాటి ప్రతిపక్ష నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనాథ్‌రెడిపై బదిలీ వేటు వేస్తూ హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా కేవలం నెలన్నర రోజులు మాత్రమే డీజీపీ పోస్టులో కొనసాగారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీని కూడా మారుస్తారని ఆ పార్టీ వర్గాలతో పాటు అధికార వర్గాలు కూడా అంచనా వేశారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టక ముందే అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న డాక్టర్‌ కేఎస్‌ జహరరెడ్డిని సెలవులో పంపించి ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ను నియమించింది. అయితే డీజీపీని మార్చడానికి కాస్తా సమయం తీసుకుంది.
సీనియర్లకే పట్టం
అయితే అటు ఐఏఎస్‌ అధికారుల్లో సీనియరిటీలో అగ్ర స్థానంలో ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు, ఇటు ఐపీఎస్‌ అధికారుల్లో అందరి కంటే సీనియర్‌ అధికారి అయిన సిహెచ్‌ ద్వారకా తిరుమలరావును డీజీపీగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించడం విశేషం. అయితే గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జూనియర్‌ అధికారులకు సీఎస్, డీజీపీలుగా నియమించింది. కేఎస్‌ జవహర్‌రెడ్డి కంటే ముందు నలుగురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. వీరిలో నీరభ్‌కుమార్‌(1987వ బ్యాచ్‌) ప్రథమ స్థానంలో ఉండగా తర్వాత పూనం మాలకొండయ్య(1988వ బ్యాచ్‌), తర్వాత వై శ్రీలక్ష్మి(1988వ బ్యాచ్‌), డాక్టర్‌ రజత్‌ భార్గవ(1990వ బ్యాచ్‌) ఉన్నారు. వీరిని కాదని సీనియారిటీలో ఐదో స్థానంలో ఉన్న డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి(1990వ బ్యాచ్‌)ని సీఎస్‌గా నియమించడం గమనార్హం.
అలాగే డీజీపీ విషయంలోను ఇదే చోటు చేసుకుంది. సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను కాదని 1992వ బ్యాచ్‌కు చెందిన కేవి రాజేంద్రనాథ్‌రెడ్డిని డీజీపీగా నియమించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియారిటీకి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ అందరి కంటే ముందు వరుసలో ఉన్న అధికారులను సీఎస్‌గాను, డీజీపీగాను నియమించడం విశేషం.
డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా పని తీరు సీఎం చంద్రబాబుకు నచ్చ లేదని, ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకారోత్సం కార్యాక్రమానికి సంబంధించి ట్రాఫిక్‌ నియంత్రణలో వైఫల్యం చెందారని, దీని వల్ల ప్రధాని మోదీకి ఆహ్వానం పలకాల్సిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుని పోవడంతో హాజరు కాలేక పోయారని, దీంతో గవర్నర్‌ కూడా చాలా విచారం వ్యక్తం చేశారని ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Next Story