ఆంధ్రలో ప్రచారాలు ఈరోజు ఇలా..
ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు జోరుగా సాగనున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారాల షెడ్యూల్ ఈరోజు ఎలా ఉందంటే..
ఆంధ్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఈ హీట్ మరింత పెరుగుతోంది. వేసవి వేడిని కూడా ఎన్నికల వేడి బీట్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రధాన పార్టీలు ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎండదెబ్బకు సొమ్మసిల్లుతుంటే అధినేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఎలా సాగనున్నాయంటే..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచే తన మూడో విడత ప్రచారాన్ని జోరుగా ప్రారంభించనున్నారు. ఈరోజు(ఏప్రిల్ 27 శనివారం) నుంచి ఈ నెల 31 వరకు ఆయన ‘ప్రజాగళం’ పేరుతో అనేక నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఆయన సభలు ఉండనున్నాయి. అందులో భాగంగా ఇవాళ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
అదే విధంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి కూడా ఈరోజు అనకాపల్లి, మన్యం జిల్లాల్లో ‘న్యాయ యాత్ర’ చేయనున్నారు. నేటి ప్రచారంలో భాగంగా ఆమె ఉదయం 10 గంటలకు పాయకరావు పేటలో, మధ్యాహ్నం 1 గంటలకు పాడేరులో, సాయంత్రం 4 గంటలకు అరకులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
ఇన్ని రోజులూ ‘మేమంతా సిద్ధం’ అంటూ రాష్ట్రాన్ని చుట్టేసి వైసీపీ సుప్రీమో జగన్ మోహన్ రెడ్డి.. రేపటి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఈరోజు వైసీపీ పార్టీ మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేస్తారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్.. తమ పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు. అందులో ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అదనంగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఈ మ్యానిఫెస్టో మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.