ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణంతో ఆ స్థానానికి బై ఎలక్షన్‌ నిర్వహించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానానికి బై ఎలక్షన్‌ నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా త్వరలో బై ఎలక్షన్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీని కోసం ఈ నెల 11న నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నవంబరు 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తర్వాత రోజు అంటే నవంబరు 19న నామినేషన్‌ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు నవంబరు 21గా పేర్కొన్నారు. డిసెంబరు 5న అంటే గురువారం పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. ఎన్నికల నిర్వహించిన తర్వాత నాలుగో రోజు అంటే డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు చేపట్టడంతో పాటు ఫలితాలను కూడా అదే రోజు ప్రకటించనున్నారు. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

యుటీఎఫ్‌ నాయకుడిగా ఉన్న షేక్‌ సాబ్జీ గత ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే గతేడాది డిసెంబరు 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. సాబ్జీ పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో వైపు దేశంలోని 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ ఇది వరకే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేరళ, పంజాబ్, యుపీ రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పోలింగ్‌ తేదీలను మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్‌ఎల్‌జేడీతో పాటు పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఈసీని కోరాయి. సాంస్కృతిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నందు వల్ల పోలింగ్‌లో ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ తేదీని మార్చింది. నవంబరు 20కి పోలింగ్‌ను మార్చింది. కేరళలో ఒకటి, పంజాబ్‌లో 4, యుపీలో 9 నియోజక వర్గాల్లో కూడా నవంబరు 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. తక్కిన స్థానాల్లో తొలుత ప్రకటించిన తేదీల్లోనే పోలింగ్‌ నిర్వహించనున్నారు.
Next Story