ఏపీకి వేల కోట్ల నష్టం.. వరదలే కారణం..
ఏపీపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. నాలుగు రోజుల పాటు అతలాకుతలం చేసిన వరదలతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
ఏపీపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. నాలుగు రోజుల పాటు అతలాకుతలం చేసిన వరదలతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టాన్ని వెలకట్టడానికి కేంద్ర బృందాలు తొలి రోజు నుంచి నిరంతరం శ్రమించాయి. సదరు బృందాలు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఏపీకి వరదల కారణంగా వేల కోట్ల నష్టం వచ్చింది. కేంద్రానికి సమర్పించడానికి ఈమేరకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నివేదికలో వరదల కలిగిన ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 43 మంది మరణించారని, 45 వేల మందిని సహాయక కేంద్రాలకు తరలించామని వెల్లడించింది. దాంతో పాటుగా దాదాపు 2 లక్షల మంది రైతులు నష్టపోయారని, 1093 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.6,882 కోట్ల నష్టం వచ్చినట్లు తమ ప్రాథమిక అంచనా అని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.
24/7 అప్రమత్తంగానే..
వరదల సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆర్పీ సిసోడియా వివరించారు. విజయవాడలోని సింగ్‌నగర్ ఇంకా వరదలను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం ఓ మొబైల్ యాప్ ద్వారా వరద నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. తొమ్మిదో తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు రెవెన్యూ శాఖ ఎన్యూమరేషన్ చేస్తూనే ఉందని చెప్పారు. కాగా అధికారులు క్లీనింగ్‌కు వచ్చిన సమయంలో ఇంటి యజమానాలు అక్కడే ఉండాలని, అప్పుడే నష్టాన్ని సరిగ్గా అంచనా వేయగలమని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రూ.6,882 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపామని ఆయన చెప్పారు.
ఆ విషయం ఊహించలేదు..
వరద సమయంలో బుడమేరుకు గండ్లు పడటం అనేది ఊహించని పరిణామం అని ఆయన వివరించారు. కాకపోతే 35 వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగానే అంచనా వేశామని, ఆ విధంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించడం ప్రారంభించామని ఆయన చెప్పారు. కానీ 2 లక్షల కుటుంబాలకు పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది సాధ్యం కాదని, ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని పునరావాస కేంద్రాలకు రావాలను ప్రజలకు చెబితే.. వాళ్లు ‘మాకు తెలుసు అంటారు’ అంటా సమస్యే ఇక్కడ బుడమేరు విషయంలో కూడా వచ్చిందని సిసోడియా వివరించారు.