ఏపీలో 20కి చేరిన మృతుల సంఖ్య.. తెలంగాణలో 17
x

ఏపీలో 20కి చేరిన మృతుల సంఖ్య.. తెలంగాణలో 17

మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఏపీ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. రహదారులు సైతం జలమయమయ్యాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.


మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఏపీ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. రహదారులు సైతం జలమయమయ్యాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లక్షలాది మంది వరదల కారణంగా తిండి, తిప్పలు లేకుండా తల్లడిల్లుతున్నారు. ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎప్పుడు ఎంతలా పెరుగుతుందో అర్థం కావడం లేదు. రెండో రోజు సాయంత్రానికి 15గా ఉన్న మృతుల సంఖ్య నేటికి 20కి చేరింది. తెలంగాణలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 17గా ఉంది. కాగా ఏపీలో ఇంకా వరదలు కొనసాగుతున్న క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడిక్కడ గల్లంతైన వారి కోసం సత్వరం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు అధికారులు.

ఇంకా వరదలోనే విజయవాడ

మూడు రోజులు ముగుస్తున్నా విజయవాడ ఇంకా వరదలోనే కొట్టిమిట్టాడుతోంది. విజయవాడ వాసులు సైతం ఇప్పటికీ ఆహారానికి, తాగునీటికి కూడా తల్లడిల్లిపోతున్నారు. రెండురోజులుగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. సహాయక చర్యలు ఎంత యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట లోటుపాట్లు ఉంటున్నాయని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఈ సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. వరద బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 41,927 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో వరద బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

వరదల వల్ల కలిగిన నష్టం

ఈ వరదల్లో 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయి. ఆర్ అండ్ బీ రోడ్లు 1,808 కిలోమీటర్ల మేరా ధ్వంసం అయ్యాయి. 1,72,542 హెక్టార్ల వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద తగ్గుముఖం పట్టిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ గేట్లు రెండు దెబ్బతిన్నాయని, మిగిలిన బ్యారేజీ అంతా పటిష్టంగానే ఉందని ఇంజనీరింగ్ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు వెల్లడించారు. గేట్లు ఎత్తడం, మూడయం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. బ్యారేజీకి వస్తున్న వరద 11.43 లక్షల క్యూసెక్కుల నుంచి 8.19 లక్షల క్యూసెక్కులకు తగ్గిందని తెలిపారు. బ్యారేజీ నుంచి కాల్పలకు 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అంతేకాకుండా బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించే చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story