‘జగన్ మాట వాస్తవమే’.. ఒప్పుకున్న టీడీపీ ఎమ్మెల్యే
x

‘జగన్ మాట వాస్తవమే’.. ఒప్పుకున్న టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ వరదలను ‘మ్యాన్ మేడ్ కలామిటీ’ అన్న జగన్ మాటలతో తానూ ఏకిభవిస్తానన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎందుకంటే..


బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ అంతటా సంభవించిన వరదలను ‘మ్యాన్ మేడ్ కలామిటీ’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంలో జగన్ మాటలతో తానూ ఏకిభవిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్న మాటలు ముమ్మూటికీ వాస్తవాలేనని, ఏపీలో సంభవించిన వరదలు నూటికి నూరు శాతం మానవ తప్పిదం వల్ల వచ్చినవేనని ఆయన కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఒక్క పని కూడా సరిగా చేయలేదని, అందుకే ఈరోజున రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలమైందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికి కూడా పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఏలేరు పొంగి పోర్లుతోందని, దాని వల్ల 40పైగా లంక గ్రామాలు నీట మునిగాయని, వారందరికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని ఆయన చెప్పారు. చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం అందించే ప్రతి సహాయం అందేలా చూడటమే లక్ష్యంగా నేతలు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వరదలు మానవ తప్పిదమే..

‘‘ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలు ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేకే. అందులో డౌట్ లేదు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేయాల్సిన పనిని సరిగా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇది జగన్ మేడ్ కలామటీనే. ఎప్పుడూ ఊహించని స్థాయిలో వరద వచ్చింది. అయినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా మరణాలను అత్యల్పంగా ఉంచడం సాధ్యమైంది. లేకుండా వరద మరణాల సంఖ్య వందల్లో ఉండి ఉండేది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 వేల క్యూసెక్కుల నీరు వస్తేనే కాకినాడ వరకూ నీళ్లు చేరాయి. ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా.. ముందు జాగ్రత్త చర్యలుగా వాటిని వదిలి నష్టాన్ని నివారించగలిగాం’’ అని వివరించారు.

రూ.కోటి విరాళం జగన్ స్థాయి కాదు

‘‘ఏలేరు ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. అందువల్లే లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఏలేరు ఆధునికీకరణకు జగన్ నయా పైసా నిధులు కూడా ఇవ్వలేదు. అసలు ఏలేరు ఆధునికీకరణ ఊసే తన ఐదేళ్ల కాలంలో ఎత్తలేదు. ఇప్పుడు వరదలు వచ్చాయి. లక్షలాది మంది ఎనలేని కష్టాలు పడుతున్నారు. వారి కోసం జగన్ ఏమైనా సహాయం చేశారా. తమ పార్టీ తరపున రూ.కోటి విరాళం ప్రకటించారు. దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో జగన్ మూడో స్థానంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి వరద బాధితుల కోసం రూ.కోటి ప్రకటించడం ఆయన స్థాయి కాదు.. సిగ్గు చేటు కూడా. వరద బాధితులను జగన్ పరామర్శించలేదు. కేవలం తన అనుచరులు ఉన్న ప్రాంతంలోనే కాసేపు తచ్చట్లాడ వెళ్లిపోయారు’’ అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సోమిరెడ్డి.

లీడర్ అంటే ఆయనే: నాదెండ్ల

వరదలపై మాజీ సీఎం జగన్ చేస్తున్న విమర్శలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లా ఉండాలన్నారు. విపత్తు వస్తే అధికారులపై భారం వేయకుండా స్వయంగా రంగంలోకి దిగి తన అనుభవంతో ప్రజలను ముంపు బారి నుంచి రక్షించిన నేత చంద్రబాబు అంటూ కొనియాడారు. ‘‘వరదలు, వర్షాలతో భారీ నష్టం వచ్చింది. సీఎం చంద్రబాబు తన అనుభవంతో ప్రజలను విపత్తు నుంచి రక్షించారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండని జగన్ మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం, బురదజల్లడంలో బిజీ అయ్యారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన చేతకాని పాలన వల్లే ఈరోజు ఇంత విపత్తు వాటిల్లింది. వైసీపీ నిర్లక్ష్యం, పాపాల వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్‌కు కంటిమీద కునుకులేకుండా అవుతుంది. అందుకే ప్రభుత్వంపై తన పేటీఎం బ్యాచ్‌తో లేనిపోని అభాండాలు వేయిస్తున్నారు. అసలు ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన జగన్‌కు ఉందా? ఈ విపత్కర సమయంలో జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో చెప్పాలి. కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఇళ్లలో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప వాళ్లు చేసిందేమీ లేదు’’ అని తూర్పారబట్టారు.

Read More
Next Story