‘స్పందన’ పేరే కాదు తీరు కూడా మారిందా? స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు!
‘స్పందన’ పోర్టల్‌ను కూటమి ప్రభుత్వం ‘మీకోసం’ పోర్టల్‌గా మార్చింది. దాంతో పాటుగా ఈ కార్యక్రమానికి ‘పీపుల్స్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్’ అని పేరు పెట్టింది.
రాష్ట్ర ప్రజల సమస్యలను నేరుగా కలెక్టర్లు తెలుసుకునేలా ఏర్పాటు చేసిన కార్యక్రమం ‘స్పందన’. ప్రతి సోమవారం ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అన్ని వివరాలను కలెక్టర్లకు అందించి తమ సమస్యను వివరిస్తారు. దానిని పరిశీలించిన కలెక్టర్.. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా సదరు శాఖ అధికారిని ఆదేశిస్తారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం పేరును ‘స్పందన’ నుంచి ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్’గా మార్చారు. కేవలం పేరే కాదు తీరు కూడా మార్చారు. దీంతో ఈ రోజు సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు నిర్వహించారు. ఇందులో తమ సమస్యలను తెలపడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
మళ్ళీ మొదలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘స్పందన’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఐదేళ్ల పాటు కొనసాగలేదు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసిన ప్రభుత్వం ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని నిర్వహిస్తూ వచ్చింది. అయితే తాజా ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ‘మీకోసం’ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఉత్తర్వులను ఇప్పటికే అందించింది. అంతేకాకుండా ఎప్పటిలానే ఈసారి కూడా ప్రజల ఫిర్యాదులను అధికారులు ఆన్‌లైన్ చేయనున్నారు. ఈ పని త్వరితగతిన పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెప్పారు. దీంతో పాటుగా ఈసారి ప్రజల సౌకర్యార్థం ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్’ ఆన్‌లైన్ పోర్టల్‌లో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త పోర్టల్ రెడీ..
ఇన్నాళ్లూ స్పందన పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసి దాని నుంచి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చింది. సోమవారం సమయంలో ఫిర్యాదు చేయలేకపోయిన ప్రజలు ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఫిర్యాదును చేయొచ్చు. తమ సమస్యలను సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లే సౌలభ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కార్యక్రమం పేరు మార్చడంతో కొత్తగా ‘మీకోసం’ పేరిట పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రజలకు మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పోర్టల్‌లో కొత్త ఫీచర్
అధికారులకు తమ సమస్యను వివరించిన ప్రజలు తమ సమస్యకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో పరిశీలించుకోవచ్చు. ఇది ఇన్నాళ్లూ ఉన్న ఫీచర్. తాజాగా తీసుకొచ్చిన ‘మీకోసం’ మరో అదనపు ఫీచర్‌ను కూడా ప్రభుత్వం జోడించింది. ఈ ఫీచర్ ద్వారా ప్రజలు తమ సమస్య పురోగతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతారు. తమ సమస్యకు సంబంధించి దస్త్రాలు ప్రస్తుతం ఏ అధికారి దగ్గర ఉన్నాయి, తమ సమస్య పరిష్కారం కావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు, ఇలాంటి అన్ని వివరాలను వారు ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల ప్రజలకు తమ సమస్యల స్టేటస్ ఎప్పటికిప్పుడు తెలుసుకునే వీలు పడుతుంది. తమ సమస్యకు సంబంధించి పురోగతిని తెలుసుకోవడానికి ప్రజలు తమ సమస్యకు సంబంధించి గ్రీవెన్స్ నెంబర్ కావాల్సి ఉంటుంది.