మేనిఫెస్టోని చూసి ఎన్నికల్లో ప్రజలు కూటమిని గెలిపించారు. విజన్ డాక్యుమెంట్లను చూసి కాదని మాజీ మంత్రి బుగ్గన అన్నారు.
సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని, వాటిని తిరిగి ఎవరు కడతారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ..మేనిఫెస్టోని చూసి ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని, విజన్ డాక్యుమెంట్లను చూసి కాదని, ఎన్నికల్లో గెలిచేంత వరకు మేనిఫెస్టోని చూపించి..గెలిచిన తర్వాత విజన్ డాక్యుమెంట్లను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఏమి చేస్తారనే దానిపై ఎన్నికల్లో ప్రజలు గెలిపించుకుంటారా? 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలే విజన్‌గా ఉండాలన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ మేనిఫెస్టోని పక్కన పెట్టి విజన్ డాక్యుమెంట్‌ను ముందుకు తెచ్చారని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి నీకు రూ.15వేలు, నీకు రూ. 18వేలు అంటూ లెక్కలేసి హామీలిచ్చారని, ఇప్పుడు వాటిని పక్కన పెట్టారని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో గెలవడానికి మేనిఫెస్టోనే ప్రధాన కారణం.. మరి ఆరు నెలలైంది..మేనిఫెస్టోని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండా విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్‌లో రూ. 6వేల కోట్లు, జూలైలో రూ. 10వేల కోట్లు, ఆగస్టులో రూ. 3వేల కోట్లు, సెప్టెంబరులో రూ. 4వేల కోట్లు, అక్టోబరులో రూ. 6వేల కోట్లు, నవంబరులో రూ. 4వేల కోట్లు, డిసెంబరులో రూ. 9వేల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో కేవలం 13 శాతం అప్పులు చేస్తే..కూటమి ప్రభుత్వం 22.6 శాతం అప్పులు చేశారని మండిపడ్డారు. యువతకు 20లక్షల ఉద్యోగాలన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు..ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు..ఇవ్వలేదు. ప్రతీ మహిళకు నెలకు రూ. 1500 అన్నారు..అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు..అది ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ. 12,450 కోట్లు అవసరం కానీ బడ్జెట్‌లో రూ. 5,386 కోట్లు కేటాయించారు..దీపం పథకానికి రూ. 3,955 కోట్లు అవసరం..బడ్జెట్‌లో రూ. 895 కోట్లు కేటాయించారు..ఆడబిడ్డ నిధికి రూ. 37,313 కోట్లు అవసరం..కానీ కేటాయింపులు మాత్రం సున్నా..అని విమర్శించారు.