‘గోకులం’ మళ్ళీ వస్తోంది.. పాడి రైతులకు సర్కార్ గుడ్ న్యూస్
x

‘గోకులం’ మళ్ళీ వస్తోంది.. పాడి రైతులకు సర్కార్ గుడ్ న్యూస్

రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పశువులు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి 90 శాతం, మేకలు, గొర్రెల షెడ్లకు 70 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.


రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పశువులు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి 90 శాతం, మేకలు, గొర్రెల షెడ్లకు 70 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు భారీగా లబ్ది చేకూరుతుంది. రైతులకు యూనిట్‌కు గరిష్ఠంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు లబ్ది చేకూరుతుందని అధికారులు వెల్లడించారు. ఈ పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

కొత్త పథకం ఏమీ కాదు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కన్నా ముందు 2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు చంద్రబాబు సర్కార్ ‘గోకులం’ పేరుతోనే ఈ పథకాన్ని అమలు చేశారు. పాడి రైతులకు పూర్తి సహకారం అందించారు. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఈ పథకాన్ని నిలిపేశారు. అప్పటికే షెడ్లు నిర్మించుకున్న రైతులకు కూడా రాయితీ డబ్బు అందించలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా తాము తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ ‘గోకులం’ పథకాన్ని పునఃప్రారంభిస్తామని ప్రజాగళం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు.

మార్గదర్శకాలు జారీ

ఇచ్చిన హామీ మేరకే తాము పాడి రైతులకు రాయితీ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయాన్ని వివరిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈనెల ఒకటో తేదీని ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. మేకలు, గొర్రెల్లు, పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకోవడానికి అర్హులకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతుందని చెప్పారాయన. ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేస్తామని వివరించారు.

Read More
Next Story