మరో రెండు హామీల అమలుకు బాబు కసరత్తు.. ఉచిత బస్సు ప్రయాణం కూడా..
x

మరో రెండు హామీల అమలుకు బాబు కసరత్తు.. ఉచిత బస్సు ప్రయాణం కూడా..

మరో రెండు పథకాలను అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే అధికారులతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.


ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, పింఛన్ పెంపు, ల్యాండ్ టైట్లింగ్ రద్దు వంటి కొన్ని హామీలను ఇప్పటికే నెరవేర్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా మరో రెండు మూడు పథకాల హామీలకు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిలో ఏపీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం పథకాలు ఉన్నాయి. వీటి అమలుపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు కసరత్తులు ప్రారంభించేశారు. ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణలో పరిస్థితులను కూడా స్టడీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

కసరత్తు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే రోజుకు బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది. పథకం అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తొచ్చు? ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి? అమలు తర్వాత తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలి? కావాల్సినన్ని బస్సులు ఉన్నాయా? లేకుంటే ఇంకా ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది? వంటి విషయాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అంతేకాకుండా ఏయే క్యాటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అన్న అంశంపై కూడా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా అన్ని మార్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు వీలవుతుందా లేదా అనే విషయంపై అధికారుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఈ పథకాన్ని అమలు చేస్తే సాధారణ ప్రయాణికులకు తిప్పలు తప్పవని, కొత్త బస్సులు తీసుకున్న తర్వాతనే ఈ పథకాన్ని ప్రారంభించాలని, అప్పటి వరకు ఈ పథకం అమలును వాయిదా వేయాలని వారు సూచించారు.

ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ఆగస్టు 15 ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు.. విశాఖ నుంచి జెండా ఊపి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ అంశంపై ఈ నెల 16న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా అదే రోజున తొలి విడత అన్న క్యాంటీన్లను కూడా పునరుద్దరించనున్నట్లు సమాచారం.

తల్లికి వందనం మార్గదర్శకాలు ఇవే

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు అందిస్తారు. సూపర్ సిక్స్ హామీలలో ఇది కూడా ఒకటి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి రూ.15 వేలు చొప్పున అందించనుంది ప్రభుత్వం. దీంతో పాటు విద్యార్థులకు ఒక కిట్ కూడా అందించనుంది ప్రభుత్వం. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడంతో ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు కావాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డ్, 75 హాజరు తప్పనిసరి వెల్లడించింది. ఆధార్ లేని పక్షంలో వెంటనే ఆధార్ కోసం నమోదు చేసుకోవాలని తెలిపింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్టూడెంట్ కిట్‌లో ఉండేవి ఇవే

విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్‌లో బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, టెక్స్ట్ బుక్స్, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్ష్నరీ ఉంటాయి.

గుర్తింపు కార్డులు ఇవే

ఆధార్ కార్డ్ లేని వారు దాని స్థానంలో.. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, పాస్‌పోర్ట్, బ్యాంకు పాస్ బుక్, పోస్ట్‌ఆఫీస్ పాస్‌బుక్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్‌బుక్, రేషన్ కార్డు, తహసీల్దారు ఇచ్చే పత్రం వీటిలో ఏ పత్రాన్నైనా గుర్తింపు కార్డుగా వినియోగించుకుని ఈ పథకాన్ని పొందవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కన్నాయి. అయితే ఈ పథకాన్ని కూడా వీలైతే ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలో దీనికి సంబంధించి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Read More
Next Story