ఇసుక ఉచిత పంపిణీకి డేట్ ఫిక్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారులు..
x

ఇసుక ఉచిత పంపిణీకి డేట్ ఫిక్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నాళ్లూ అమల్లో ఉన్న ఇసుక పంపిణీ విధానంలో మార్పు తీసుకురావాలని నూతన ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇసుక ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నాళ్లూ అమల్లో ఉన్న ఇసుక పంపిణీ విధానంలో మార్పు తీసుకురావాలని నూతన ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇసుక ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఉచిత పంపిణీ జూలై 8(సోమవారం) నుంచే అమలు కానుంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు. ఈ మేరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని ఖర్చులకు మాత్రం నగదును వసూలు చేయాలని అధికారులకు సూచించింది.

ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా నిఘా

ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇసుక పంపిణీ ఉచితమైన నేపథ్యంలో అక్రమ రవాణా, తవ్వకాలు మితిమీరిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్పారు. దాన్ని అరికట్టడానికి, ఇసుక మాఫియాకు చెక్ చెప్పడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు పటిష్టమైన నిఘా ఉంచుతాయని ప్రభుత్వం వివరించింది. ఎవరైనా అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరించింది.

వాళ్లకు మాత్రం ఛాన్స్

ఇదిలా ఉంటే ఊర్లలో ఉండే వాగులు వంకల నుంచి రైతులు, స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తీసుకెళ్లడానికి మాత్రం మినహాయింపు కల్పించింది ప్రభుత్వం. వారు తమ ఎడ్ల బండ్లలో వాగుల్లోని ఇసుకను తవ్వి తీసుకెళ్లొచ్చని, వారిపై చర్యలు ఉండవని, తీసుకోవద్దని అధికారులకు ప్రభుత్వం తెలిపింది. దీంతో పల్లెటూర్లలో ఉండే రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పక్కకు తప్పుకున్నాయని కూడా ఆయన వెల్లడించారు.

సోమవారం నుంచి ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని రాష్ట్ర గనుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిల్వలను సోమవారం నుంచి ఉచితంగా ప్రజలకు అందించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే రానున్న కాలంలో రాష్ట్రంలో ఇసుక డిమాండ్ తారాస్థాయికి చేరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగా చర్యలు, తవ్వకాలు చేయాలని, అధికంగా తవ్వకాలు చేయొద్దని కూడా ప్రభుత్వం.. అధికారులను వివరించింది. ప్రజలు కూడా తమ అవసారలకు తగ్గట్టుగానే ఇసుకను తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం.

ఏడాదికి ఎంత ఇసుక కావాలంటే!

ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలను ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెరగనున్న ఇసుక డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రానున్న మూడు నెలలకు రాష్ట్రంలో 88 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుందని, అదే విధంగా ఏడాదికి 3.20కోట్ల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాని ప్రకారమే తవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది. అదే విధంగా జిల్లాలోని ఇసుక రీచ్‌లో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అన్న సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. అదే విధంగా ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కూడా ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి కలెక్టర్ నిర్ణయిస్తారు.

ప్రజలు చెల్లించే మొత్తం ఎంతంటే..

అయితే సీనరేజ్ కింద టన్ను ఇసుకకు ప్రజల నుంచి రూ.88 సేకరించనుంది ప్రభుత్వం. అదే విధంగా ఇప్పటివరకు జరిపిన తవ్వకాల ఖర్చు కింద టన్నుకు మరో రూ.30 వసూలు చేయనుంది. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బొట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 వసూలు చేయనున్నారు అధికారులు. దీంతో పాటుగా రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రాలకు ఇసుకను తరలిస్తే ఆ రవాణా ఖర్చుగా టన్నుకు రూ.4.90 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 తీసుకుంటారు. వీటన్నింటికి కలిపి మళ్ళీ 18 శాతం జీఎస్‌టీ ఉంటుంది. దీంతో వీటన్నింటిని కలుపుకుని టన్ను ఇసుకకు ధర ఎంత అనేది జిల్లా కలెక్టర్లు నిర్ధారిస్తారు.

Read More
Next Story