కొడాలి నానిని అరెస్ట్ చేయొద్దు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేయొద్దని.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. అసలు ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు సిద్ధమయ్యారు?
‘తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు’ తయారైంది వైసీపీ నేత కొడాలి నాని పరిస్థితి. ఎన్నికల సమయంలో వైసీపీ పక్కా ప్లాన్ ప్రకారం వాలంటీర్ల చేత రాజీనామా చేయించి.. వారిని తమ ప్రత్యేక కార్యకర్తలుగా వైసీపీ వినియోగించుకుందన్న ప్రచారం చాలా జోరుగానే సాగింది. దానిని ప్రస్తుత పరిస్థితులు నిజం కూడా చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అనేక మంది రాజీనామా చేసిన వాలంటీర్లు తాము స్వచ్చందంగా రాజీనామా చేయలేందంటూ రోడ్లెక్కిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే విధంగా కొందరు రాజీనామా చేసిన వాలంటీర్లు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
దీంతో కొడాలి నాని అరెస్ట్‌కు అంతా సిద్ధమైంది. వెంటనేస్పందించిన వైసీపీ.. కొడాలి నానిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టులో కొడాలి నానికి ఊరట లభించింది. వైసీపీ కోరిన విధంగా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అదే విధంగా మాజీ మంత్రి కొడాలి నానికి 41ఏ నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొడాలి నానికి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అనంతరం ఆయన విచారణను కూడా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ఆ సమయంలో వారిని తమ కార్యకర్తలుగా వినియోగించుకోవడానికే వైసీపీ ఈ ప్లాన్ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తీరా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఇప్పుడు తిరిగి తమను విధుల్లో చేర్చుకోవాలని సదరు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాపోతున్నారు. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో వైసీపీ నేతల ఒత్తిడి వల్లే తాము రాజీనామాలు చేశామని వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే కొడాలి నానిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని స్వీకరించిన పోలీసులు కొడాలి నాని సహా ఆయన అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు గోర్ల శ్రీను తదితరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో వైసీపీ నేతలు పలువురు హైకోర్టును ఆశ్రయించి కొడాలి నాని అరెస్ట్‌ను ఆపించారు.