మాజీ మంత్రి పేర్ని నానితో పాటు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కొడుకు వైవీ విక్రాంత్ రెడ్డిలకు హై కోర్టులో ఊరట లభించింది.
రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నానికి ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్ని నానికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. రేషన్ బియ్యం మాయమైన వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిని ఏ6గా నిందితుడి జాబితాలో చేర్చారు. పేర్ని నానితో పాటు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కొడుకు వైవీ విక్రాంత్‌రెడ్డికి కూడా ఊరట లభించింది. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఒక గోడౌన్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చినా, వీరి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో తన గోడౌన్‌లో బియ్యం మాయమయ్యాయని, దీనిపై విచారణ జరిపించాలని పేర్ని నాని గతేడాది డిసెంబరులో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు బియ్యం మాయమయ్యాయని నిర్థారించారు. ఆ మేరకు పేర్ని నాని, ఆయన భార్య జయసుధతో పాటు నలుగురు నిందితుల మీద కేసు నమోదు చేశారు. గోదాము మేనేజర్ మానస తేజ పౌరసరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజులపై కేసులు నమోదు చేశారు. ఏ1గా ఉన్న జయసుధకు కోర్టు ఇది వరకే బెయిల్ మంజూరు చేసింది. పేర్ని నానిని ఏ6గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పేర్ని నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్ని నానికి ఊరటను కలిగిస్తూ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
కాకినాడ డీప్ వాటర్ పోర్టు కాకినాడ సెజ్ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి వైవీ విక్రాంత్‌రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేవీఆర్ గ్రూపుకు చెందిన వాటాలు అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబరులో 6న విక్రాంత్‌రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ సెజ్ వాటాల బదిలీ వ్యవహారంలో విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీ పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. విక్రాంత్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Next Story