గత ప్రభుత్వంలో హేమచంద్రారెడ్డి ఈ పదవిలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ ప్రొఫెసర్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. హన్మకొండలో ఉంటున్న ప్రొఫెసర్ మధుమూర్తిని ఏపీ హెచ్‌ఈసీ చైర్మన్‌గా నియమించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు మధుమూర్తి చైర్మన్‌గా కొనసాగనున్నారు. అయితే ప్రొఫెసర్ మధుమూర్తి ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. ఎన్‌ఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉన్నారు. ఫ్రొఫెసర్ మధుమూర్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడికి చెందిన వారు. విశాఖపట్నంలో విద్యను అభ్యసించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హన్మకొండలో ఉంటున్నారు. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో హేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి వైస్ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ రామమోహన్‌రావు ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో తాజాగా మధుమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.